Dorasani Review
అమ్మాయి గొప్పింటి బిడ్డ. అబ్బాయి పూరింటి పిల్లాడు. వారిద్దరి మధ్య టీనేజ్‌లో ప్రేమ పుడుతుంది. అతను అప్పటికి చదువుకుంటూ ఉంటాడు. ఆమె అప్పుడప్పుడే ఊహల్లో తేలుతూ ఉంటుంది. వారి ప్రేమను పెద్దలు హర్షిస్తారా? మిద్దింటి భామకు, పూరింటి పిలగాడికి ఓ తెలంగాణ పల్లెటూళ్లో నడిచిన ఇలాంటి కథ ఏ కంచికి చేరిందో చూడాలంటే ‘దొరసాని’ చూడాల్సిందే.
కథ:
తెలంగాణలోని ఓ మారుమూల పల్లెటూళ్లో గడీలో ఉన్న దొరసాని (శివాత్మిక) చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంటుంది. తండ్రి పట్ల భయభక్తులు, అన్న పట్ల అనురాగంతో ఎదుగుతుంది. పెద్దగా ఎవరితోనూ మాట్లాడకుండా హుందాగా పెరుగుతుంది. గంభీరమైన ఆమె ముఖం వెనుక మెత్తటి హృదయం ఉంటుంది. అదే ఊరికి చెందిన రాజు (ఆనంద్ దేవరకొండ) పొరుగూరులో అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. సెలవుల కోసం 15 రోజులు సొంత ఊరుకు వస్తాడు. అతని తల్లిదండ్రులు సొంత ఊళ్లో సున్నం వేసుకుంటూ కూలిపని చేసుకుంటూ ఉంటారు. దొర దగ్గర అప్పు చేసి మరీ కుమారుడిని చదివిస్తుంటారు. ఒకసారి పండుగ రోజున స్నేహితుడితో కలిసి గడీకి వెళ్లిన రాజు అక్కడ దొరసానిని చూస్తాడు. తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. అతని కవితలను, అతను చూపుతున్న ప్రేమను ఆమె కూడా ఇష్టపడుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం దొరకు తెలుస్తుంది. రాజును దొర ఎక్కడ ఏం చేస్తాడోననే భయంతో దొరసాని తనంతట తానే హైదరాబాద్‌కు వెళ్తానని అంటుంది. తీరా అక్కడికి వెళ్లిన ఆమెకు రాజుకు జరిగిన అన్యాయం తెలుస్తుంది. అక్కడ ఉండబట్టలేక వచ్చేస్తుంది. తీరా వచ్చాక ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి? దాని వల్ల ఆమెకూ, రాజుకూ జరిగిన కీడేంటి? ఎవరు తలపెట్టారు? వారి ప్రేమకు ఎవరు మద్దతు పలికారు? వారి ప్రేమ విషయంలో ఆమె తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆమె సోదరుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? వంటివన్నీ ఆసక్తికరం.
ప్లస్ పాయింట్లు:
చిత్ర యూనిట్ ముందే చెప్పినట్టుగానే సినిమా థియేటర్లో కూర్చున్న కొద్ది క్షణాల్లోనే మనం 30 ఏళ్ల వెనక్కి వెళ్తాం. అప్పటి తెలంగాణ పల్లెలు, వారు మాట్లాడేతీరు, దొరలాగా ఉండే దొర, అతని కనుసన్నల్లో మెలిగే జనాలు, బాంచెన కాల్మొక్కత్తా వంటి భయాలు, నక్సలైట్ మూమెంట్స్, అన్నలకు సపోర్ట్ చేసేవాళ్లు, వాళ్లను అమానుషంగా కాల్చిన పోలీసులు... ఇలా వాతావరణం మొత్తం పూర్వపు తెలంగాణ పల్లెలనే తలపిస్తుంది. కూలోడి కొడుకే అయినా, కాసింత చదువుకుని, తన చుట్టూ ఉన్న దోస్తులతో సరదాగా ఉంటూ, వారిలోనూ చైతన్యం తీసుకురావాలనుకునే రాజు పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టు సరిపోయాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాలో పూర్తి స్థాయి క్రెడిట్ శివాత్మికదే. ఆమె ప్రతి కాస్ట్యూమ్‌లోనూ అందంగా కనిపించింది. ప్రతి ఎమోషననూ చక్కగా పండించింది. సంగీతం, కెమెరా, ఆర్ట్, లొకేషన్లు, డైరక్షన, కొత్తవారైనా నటీనటుల పనితీరు బావున్నాయి.
మైనస్ పాయింట్లు:
ఈ సారి కూడా చిత్ర యూనిట్ చెప్పిన మాటే చెప్పాలి. తెలుగు తెరమీద వచ్చిన కొన్ని వందలాది చిత్రాలకు ఈ సినిమాతో ఉన్న పోలిక ‘రిచ గర్ల్... పూర్ బోయ్’ అన్నది. కాస్త సినిమాటిక్ వేలో వెళ్తే పెళ్లవుతుంది. కాస్త హానెస్ట్ అటెంప్ట్ చేస్తే ప్రేమ ఓడిపోతుంది... క్లైమాక్స్‌ను ఇంతకు మించి ఊహించడానికి కూడా ఏమీ లేదు. ముందే తెలిసిపోయిన క్లైమాక్స్ కోసం ఊపిరి బిగబట్టి చూడాల్సిన పనిలేదు. మరో ఇబ్బంది ఏంటంటే.... స్లో నెరేషన. సినిమా నిదానంగా సాగుతుంది. మనం చెప్పేది ఎంత 30 ఏళ్ల ముందునాటి కథ అయినా సరే, ఇంకాస్త స్పీడ్ ఉన్నా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదేమో.
విశ్లేషణ:
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు, జీవితా రాజశేఖర్ కుమార్తెగా నాయికగా పరిచయమవుతోందని చెప్పగానే సినిమా మీద సహజంగానే ఆసక్తి పెరిగింది. ఆ అంచనాలకు ధీటుగానే నటించారు ఇద్దరూ. ఇందులో లిప్‌లాక్‌లున్నాయా? అని పలువురు వేసిన ప్రశ్నలకు కూడా సమాధానం దొరికేసింది. ఎమోషనల్ లాక్స్ ఉండనే ఉన్నాయి. అన్నిటికన్నా సింక్ సౌండ్‌ను బాగా అచీవ్ చేయగలిగారు. శివానీ పోలీస్ స్టేషనకు వచ్చే సీనలో, ఆనంద్ దేవరకొండ సెల్‌లో న్యూడ్‌గా కనిపించినప్పుడు ఎమోషన పీక్స్‌గా ఉంటాయి. ఆఖరిగా క్లైమాక్స్‌లో హీరోయిన బ్రదర్‌కున్న ‘దొర’ ఫీలింగ్‌ను దర్శకుడు చక్కగా కన్వే చేశారు. కాకపోతే సినిమా అడుగులో అడుగు వేసుకుంటున్నంత స్లోగా నడుస్తుంది. ఎంతకీ హీరోహీరోయిన్లు ఒకరిని ఒకరు చూసుకోవడంతోనే సినిమా ఉంటుంది. అందువల్ల స్ర్కీనప్లేలో వేగం కనిపించదు. ఒకానొకచోట ప్రేక్షకుడికి విసుగు కూడా కలుగుతుంది. అంతకు మించి యువతకు కనెక్ట్ అయ్యి, తెలంగాణలోని నాటి పరిసరాలను అర్థం చేసుకుని, స్వచ్ఛమైన ప్రేమ కథను ఆస్వాదించగలిగితే ‘దొరసాని’ ఫీల్‌గుడ్ చిత్రమే. క్లైమాక్స్‌లో జరిగింది ఏదైనా రాజు కోసం దొరసాని గడి దాటి అడుగుబయటపెట్టినప్పుడే అతని ప్రేమ కథ గెలిచింది. ప్రేమ కూడా ఉద్యమంలాంటిదే అనే డైలాగ్‌లో మంచి డెప్త్ ఉంది. ఇలాంటి డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి. దర్శకుడి ఫస్ట్ అటెంప్ట్ క్లారిటీగా ఉంది.
బాటమ్ లైన్: గడిదాటిన ‘దొరసాని’
Read 'Dorasani' Movie Review in English
- Read in English