Download App

Dora Review

హ‌ర్ర‌ర్ చిత్రాల ట్రెండ్ ముగిసిన‌ట్టే క‌న‌ప‌డ‌టం లేదు. ముఖ్యంగా ద‌క్షిణాదిన హార్ర‌ర్ ప్ర‌ధానంగా రూపొందిన చిత్రాలు మంచి విజ‌యాల‌ను సాధిస్తుండ‌ట‌మే అందుకు కార‌ణం. ఒక‌ప్పుడు లో బ‌డ్జెట్ చిత్రాలు, కొత్త న‌టీన‌టులు చేసే హార్ర‌ర్ చిత్రాల‌ను ఇప్పుడు స్టార్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా త్రిష‌, న‌య‌న‌తార వంటి స్టార్ హీరోయిన్స్ ప్ర‌ధానంగా టైటిల్‌పాత్ర‌లో హ‌ర్ర‌ర్ చిత్రాలు చేస్తుండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలే క్రియేట్ అవుతున్నాయి. మ‌యూరి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టిన న‌య‌న‌తార న‌టించిన మ‌రో హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం `డోర‌`. అస‌లు డోర అంటే ఏమిటి? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ:

రామ‌య్య‌(తంబి రామ‌య్య‌) భార్య మ‌ర‌ణించినా మ‌రో పెళ్ళి చేసుకోకుండా త‌న ఒక్క‌గానొక్క కూతురు పారిజాత కృష్ణ‌వేణి(నయ‌న‌తార‌)ను పెంచి పెద్ద చేస్తాడు. తండ్రి అంటే పారిజాతంకు చాలా ఇష్టం. తండ్రి కార‌ణంగానే పెళ్ళి కూడా వాయిదా వేస్తుంటుంది. ఓసారి రామ‌య్య పారిజాతంతోకలిసి త‌న చెల్లెలు ఇంటికి వెళితే తండ్రి కూతుళ్ళ‌కు అక్కడ అవ‌మానం జ‌రుగుతుంది. దాంతో పారిజాతం ఎలాగైనా త‌న మేన‌త్త కుటుంబం కంటే గొప్ప‌గా ఎదిగి చూపిస్తామ‌ని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది. త‌న ఛాలెంజ్‌ను నిల‌బెట్టుకోవ‌డానికి ఓ ట్రావెల్స్ కంపెనీని స్టార్ట్ చేయాల‌ని నిర్ణ‌యించుకుని ఓ కారును కొంటుంది. ఆ కారు కొన్న త‌ర్వాత పారిజాతం, రామ‌య్య జీవితాలు అనుకోని మ‌లుపులు తిరుగుతాయి. కారు హ‌త్య‌లు చేయ‌డం మొద‌లు పెడుతుంది. ఇంత‌కు కారు హ‌త్య‌లు చేయ‌డ‌మేంటి?  కారుకు, హ‌త్య చేయ‌బడుతున్న‌వారికి ఉన్న సంబంధ‌మేంటి?  డోర ఎవ‌రు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్:

- న‌య‌న‌తార న‌ట‌న‌
- క‌థ‌నం
- సంగీతం

 మైన‌స్ పాయింట్స్:

- కొత్త క‌థేమీ కాదు
- సాగ‌దీత అంశాలు

స‌మీక్ష:

న‌య‌న‌తార..ప్ర‌ధానంగా రూపొందిన డోర చిత్రంలో అన్నీ తానై సినిమాను ముందుకు న‌డిపింది. పారిజాతం పాత్ర‌లో తండ్రిపై ప్రేమ ఉండే కూతురు పాత్ర‌తో పాటు, హ‌ర్ర‌ర్ సన్నివేశాల్లో న‌య‌న‌తార త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించింది. పోలీస్ ఆఫీస‌ర్ పెళ్ళిచూపుల‌కు వ‌చ్చి న‌చ్చ‌లేద‌ని చెప్పిన‌ప్పుడు న‌య‌న‌తారా ఛాలెంజ్ చేస్తూ మాట్లాడే సన్నివేశం. అలాగే హ‌త్య‌ల విష‌యంలో పోలీసులు న‌య‌న‌తార‌ను అరెస్ట్ చేసిన‌ప్పుడు అక్క‌డ హ‌రీష్ ఉత్త‌మ‌న్‌తో భ‌య‌ప‌డుతూనే హ‌త్య‌ల‌ను తానే చేశాన‌ని చెప్పే స‌న్నివేశాల్లో మంచి అభిన‌యం చూపింది. తండ్రి పాత్ర‌లో తంబి రామ‌య్య‌, పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో హ‌రీష్ ఉత్త‌మ‌న్‌లు చ‌క్క‌గా న‌టించారు. సినిమాలో మిగిలిన పాత్ర‌ధారులంతా వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ద‌ర్శ‌కుడు దాస్ రామ‌స్వామి స‌మాజంలో ఆడ‌పిల్ల‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల‌కు ప‌గ‌, ప్ర‌తీకారం అనే అంశాల‌ను ముడిపెడుతూ ఓ కారు, దానిలోకి మ‌నిషి ఆత్మ కాకుండా కుక్క ఆత్మ చేరి ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం అనే విష‌యాలతో సినిమాను చ‌క్క‌గా నడిపాడు. వివేక్ శివ మెర్విన్‌, సోలోమ‌న్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. దినేష్ కృష్ణ‌న్ సినిమాటోగ్ర‌ఫీ కూడా సినిమాకు అద‌న‌పు బ‌లాన్నిచ్చింది. కారు చేజింగ్ సీన్స్‌తోపాటు, పోలీసులు న‌య‌న‌తార‌ను చేస్ చేస్తున్నప్పుడు ఆ స‌న్నివేశాల‌ను దినేష్ కృష్ణ‌న్ చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. తెలుగు డైలాగ్స్ కృత‌కంగా ఉన్నాయి. కొన్ని చోట్ల లిప్ సింక్ కాలేదు. కారులో ఆత్మ చేరి ప‌గ తీర్చుకోవ‌డం అనే కారుదిద్దిన కాపురం..మెకానిక్ మావ‌య్య వయ్య వంటి చిత్రాల్లోనే చిత్రీకరించేశారు. కాబ‌ట్టి క‌థ ప‌రంగా కొత్తగా చెప్పుకోనంత‌గా ఏమీలేదు. ఫ‌స్టాఫ్‌లో తొలి ఇర‌వై నిమిషాలు సినిమాను డ్రాగింగ్ సీన్స్‌తో సాగుతుంది. ఇంటర్వెల్ త‌ర్వాత డోర వెనుక క‌థేంటో తెలిసిపోవ‌డంతో క‌థ‌లో ఆస‌క్తి ఉండ‌దు. డోర ప‌గ‌, ప్ర‌తీకారంలో ఎమోష‌న్స్ సెకండాఫ్‌లో బ‌లంగా లేవు. మొత్తం మీద మ‌నిషి ఆత్మ‌లే కాదు..జంతువుల ఆత్మ‌లు కూడా ప్ర‌తీకారం తీర్చుకుంటాయ‌ని చెప్పే ప్ర‌య‌త్నమే ఈ చిత్రం

బోటమ్ లైన్: ప‌గ‌, ప్ర‌తీకారం మ‌నుషుల‌కే కాదు.. జంతువుల‌కు ఉంటుంద‌ని చెప్పే 'డోర‌'

Dora English Version Review

Rating : 2.5 / 5.0