వైసీపీకి ఓటు వేయొద్దు.. వివేకాను ఎవరు చంపారో ప్రజలకు తెలుసు: సునీత
- IndiaGlitz, [Tuesday,April 02 2024]
వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయని మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తెలిపారు. వివేకా హత్య జరిగిన తర్వాత జగన్ అన్న నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని వాపోయారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మానని మీరు చెప్పినట్టు చేశానని తెలిపారు. షర్మిల, తాను ఎవరి ప్రభావంతోనే మాట్లాడుతున్నట్లు జగన్ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని.. వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసని చెప్పారు. ఎవరైనా ఒకసారి మోసం చేయొచ్చు.. పదేపదే మోసం చేయలేరని సూచించారు.
వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసునని, ప్రజలు చాలా తెలివైన వారన్నారు. వివేకాను ఎవరూ చంపారో దేవుడితో పాటు కడప జిల్లా ప్రజలందరికీ తెలుసని జగనన్న అంటున్నారని.. ఆయన కూడా కడప ప్రజల్లో మనిషే కదా? అంటే మీకు కూడా ఎవరు చంపారో తెలుసు కదా.. మరి ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. మీకు అంత భయమెందుకు? తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. కనీసం అన్నగా తనకు సమాధానం చెప్పకపోయినా సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు ఎక్కడ చెబితే అక్కడ చర్చకు సిద్ధమని సాక్షి ఛానల్‌కు రమ్మన్నా చర్చకు వస్తానని స్పష్టం చేశారు.
జగనన్న పార్టీకి ఓటు వేయొద్దని ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదు అన్నారు. మన ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దామని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. తన తండ్రిని హత్య చేసిన వారికి చేయించిన వారికి శిక్ష పడాలని చెప్పారు. ఎంపీగా పోటీ చేయాలని వివేకా శాయశక్తులా కృషి చేశారని, ఆ ప్రయత్నంలోనే హత్యకు గురయ్యారని తెలిపారు. కడప ఎంపీగా పోటీ చేయబోతున్న షర్మిలకు శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని.. జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక షర్మిలకు భయపడి ఆమెను దూరం పెట్టారన్నారని చెప్పుకొచ్చారు.
‘వివేకం’ సినిమా ఎవరు తీశారో తనకు తెలియదని కానీ చాలా ధైర్యంగా తీశారని సునీత పేర్కొన్నారు. సినిమాలో చూపించిన దానికంటే ఇంకా ఘోరంగా తన తండ్రిని హత్య చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు చోటు ఉండకూడదని వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే తాను ముందుకు వచ్చానని ఆమె వెల్లడించారు.