YS Sunitha Reddy:మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దు.. ప్రజలకు వైయస్ సునీతారెడ్డి పిలుపు..

  • IndiaGlitz, [Friday,March 01 2024]

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాకూడదంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి(YS Sunitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విచారణ ఆలస్యంతో పాటు నిందితులకు సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్‌కు చెందిన వైసీపీకి ఓటేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు

హత్యలు చేసేవాళ్లు రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో ఉండకూడదు, పాలించకూడదన్నారు. మరోసారి తన అన్న అధికారంలోకి వస్తే వివేకా హత్య కేసుకు న్యాయం జరగదని తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ సరిగ్గా విచారణ చేయడం లేదని వారిపై ఏ ప్రెజర్ ఉందో తనకు తెలియదని చెప్పారు. ట్రయల్ జరిగితేనే హంతకులకు శిక్ష పడుతుందని తెలిపారు. కర్నూలులో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వెళ్లి కూడా సీబీఐ అధికారులు వెనక్కి వచ్చారని... ఎవరినైనా అరెస్ట్ చేయకుండా సీబీఐ వెనక్కి రావడం ఎప్పుడైనా జరిగిందా? అని ప్రశ్నించారు. వీళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారంటూ ఆరోపించారు.

ఈ కేసులో తాను చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఎంపీ రఘురామకృష్ణరాజు, లాయర్లు, డాక్టర్లు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్టన్లు ఆమె తెలిపారు. అలాగే తన సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా తొలి నుంచి తనకు సహకరించారని.. మద్దతుగా నిలిచారని చెప్పారు. వివేకా హత్య కేసుకు సంబంధించి ఈ ఐదేళ్లు ఏం జరిగిందో ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టానని వివరించారు. తన తల్లి ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ వేశారని.. జగన్ కూడా పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ను జగన్ ఉపసంహరించుకున్నారని.. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీశారు.

సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు మర్డర్ చేశారనేది 4-5 రోజుల్లో తెలిసిపోతుందని.. కానీ వివేకా కేసులో ఐదేళ్లైనా ఇంకా ఎందుకు తెలియడం లేదని ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా గారు పోటీ చేశారని.. సొంతవారే మోసం చేయడంతో ఆయన ఓడిపోయారన్నారు. అయినా నిరాశ చెందకుండా.. మరింత యాక్టివ్‌ అయ్యారన్నారు. దీంతో ఆయన్ను అడ్డు తొలగించుకున్నారని చెప్పుకొచ్చారు. అప్పట్లో తమకు ఇదంతా అర్థం కాలేదన్నారు. హత్య తర్వాత మార్చురీ బయట అవినాష్‌ తన వద్దకు వచ్చారని.. రాత్రి 11.30 గంటల వరకు పెదనాన్న తనకోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారని తెలిపారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారని... మనం మాత్రం రియలైజ్‌ కాలేమన్నారు.

ఈ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని.. ఆయనను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ హత్యలో జగన్ పాత్రపై కూడా విచారణ జరగాలని కోరారు. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ప్రజలకు ఏం సందేశం వెళ్తుంది? అన్నారు. జగన్ మీద 11 అక్రమ కేసులు ఉన్నాయని... ఆ కేసుల మాదిరే వివేకా హత్య కేసు కూడా కాకూడదని వాపోయారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే... తన తండ్రికి న్యాయం జరగదని చెప్పారు. తన తండ్రి హత్యలో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని.. ఆయనకు శిక్ష పడాల్సిందేనని సునీత డిమాండ్ చేశారు.