అయోధ్య రామమందిరానికి వెండి ఇటుకలు పంపొద్దు: తీర్థక్షేత్ర ట్రస్ట్
- IndiaGlitz, [Thursday,February 18 2021]
అయోధ్య రామ మందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామ మందిరం నిర్మాణానికి తమ వంతు సాయం అందించాలని భావిస్తున్న భక్తులు ధనం లేదంటే వెండి ఇటుకలనో ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వెండి ఇటుకలను భక్తులు పంపించారు. అయితే ఇక మీదట మాత్రం ఎవరకూ వెండి ఇటుకలను పంపించవద్దని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. భక్తులు బహూకరించిన వెండి ఇటుకలను భద్రపరచడానికి బ్యాంకు లాకర్లలో స్థలం లేదని, అందుకే ఎవరూ వెండి ఇటుకలను సమర్పించవద్దని కోరింది.
ఇప్పటి వరకూ భక్తులు 400 కిలోగ్రాముల వెండి ఇటుకలను సమర్పించారని ట్రస్ట్ వెల్లడించింది. ఇక అంతకు మించి భద్రపరచలేమని స్పష్టం చేసింది. రామ మందిర నిర్మాణానికి దేశంలో అనేక మంది భక్తులు వెండి ఇటుకలను బహూకరిస్తున్నారని ట్రస్ట్ తెలిపింది. ఇంకా వెండి ఇటుకలను పంపిస్తూనే ఉన్నారని వెల్లడించింది. అయితే వాటిని ఎలా భద్రపరచాలన్నదే సమస్యగా మారిందని ట్రస్ట్ తెలిపింది. ప్రస్తుతానికి ఎవరూ వెండి ఇటుకలను బహూకరించవద్దని కోరింది. ఇప్పటికే బ్యాంక్ లాకర్లన్నీ నిండిపోయాయని వెల్లడించింది. భక్తుల మనోభావాలను తాము గౌరవిస్తామని కానీ భద్రపరచడమనేది కష్టంగా మారిందని ట్రస్ట్ తెలిపింది.