జగన్ వ్యాఖ్యలపై స్పందించకండి.. జనసేన నేతలకు పిలుపు!
- IndiaGlitz, [Monday,November 11 2019]
‘సినిమా నటుడు పవన్ కల్యాణ్‌కు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో.. ఎంత మంది పిల్లలో మరి. నలుగురు ఐదుగురు పిల్లలున్న పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవటం లేదా?. మేం ప్రపంచ స్థాయి కోసం ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, వెంకయ్య, నటుడు పవన్ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియామ్ ప్రవేశపెట్టడము ఎందుకు విమర్శ లు చేస్తున్నారు. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా..?’ అని ఇంగ్లీష్ బోధనపై విమర్శించిన వారందరికీ ఒక్కసారిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్ట్రాంగ్ పంచ్‌ల వర్షం కురిపించారు. విజయవాడలో జరిగిన అబ్దుల్ కలాం విద్యా పురస్కారాల కార్యక్రమం సందర్భంగా జగన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
రేపు కౌంటరివ్వనున్న పవన్ కల్యాణ్!
ఇందుకు స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ నేతలకు కొన్ని సలహాలు సూచనలు చేశారు. ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలపై జనసైనికులు సంయమనం పాటించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ‘ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యక్తిగత ఆరోపణలపై మన పార్టీ నాయకులు గానీ జనసైనికులు గానీ స్పందించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. భవన నిర్మాణ కార్మికుల కోసం మనం చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నాము. మన అధ్యక్షులు ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు బాధాకరమైనప్పటికీ ప్రజా క్షేమం కోసం మనం భరిద్దామని పవన్ చెప్పారు. మంగళవారం పవన్ కళ్యాణ్ విజయవాడ వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటుచేస్తున్నాం. పార్టీ అధ్యక్షులు అన్నిటికీ బదులిస్తారు. దయచేసి పార్టీ శ్రేణులు సంయమనం పాటించవలసిందిగా కోరుతున్నాను’ అంటూ ఓ నోట్ రిలీజ్ చేశారు.