BiggBoss: ‘‘వెర్రిపప్ప’’ అయిన శ్రీహాన్.. మారని అర్జున్, గీతూకు గడ్డిపెట్టిన తండ్రి
Send us your feedback to audioarticles@vaarta.com
నామినేషన్స్ తర్వాతి రోజు నుంచి గొడవలు, గలాటాలతో దబిడి దబిడే అనుకుంటే ... నిన్న బ్యాటరీ రీచార్జ్ అనే టాస్క్ తెచ్చాడు బిగ్‌బాస్. సుదీప, శ్రీహాన్, ఆదిరెడ్డిలు తమ ఆత్మీయులతో మాట్లాడి కాస్త ఛార్జ్ అయ్యారు. ఈ టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అయ్యింది. తొలుత ముగ్గురు బ్యాటరీలో 95 శాతం వాడుకోవడంతో కేవలం 5 శాతమే మిగిలింది. మిగిలిన వారి కోసం బ్యాటరీ రీచార్జ్ చేయాలంటే ఇంటిలోని చక్కెర మొత్తాన్ని త్యాగం చేయాలని , లేదంటే బాలాదిత్య స్మోకింగ్ మానేస్తే బ్యాటరీ 90 శాతం పెరుగుతుందని చెప్పాడు. గీతూ బయటకు వచ్చి బిగ్‌బాస్ చెప్పినట్లు కాకుండా తన వెర్షన్ కూడా యాడ్ చేసింది. బ్యాటరీ రీఛార్జ్ కావాలంటే ఇంటి సభ్యులంతా ఫుడ్ త్యాగం చేయాలని, లేదా బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలని చెప్పింది. దీంతో ఇంటి సభ్యుల కోసం తన ఆరోగ్యం కోసం సిగరెట్లు మానేస్తున్నట్లు బాలాదిత్య చెప్పాడు.
అనంతరం కన్ఫెషన్ రూమ్‌లోకి గీతూని పిలిచిన బిగ్‌బాస్.. ఆమెకు పిల్లి బొచ్చు, పిల్లి వీడియో, ఆడియో కాల్ ఆప్షన్ ఇచ్చాడు. దీంతో పిల్లి బొచ్చు కోసం గీతూ బాధపడింది. ఫీల్ అవుతూనే ఆడియో కాల్ ఎంచుకుని తండ్రితో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆయన ఆమెకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఇప్పుడే విన్నర్ అయిపోయినట్లు ఊహించుకోకు.. ప్రస్తుతానికైతే టాప్ 5లో ఖచ్చితంగా వుంటావని ఆయన అన్నారు. కొంచెం నీ యాటిట్యూడ్ మార్చుకుని.. ప్రతి ఆడపిల్ల తాము కూడా గీతూలా వుండాలి అనిపించుకునేలా గర్వపడేలా చేయి అని కోరారు. నీ బిహేవియర్లో కొన్ని మార్చుకుంటే రోల్ మోడల్‌గా మారతావని గీతూ తండ్రి సూచించారు.
తర్వాత మన భగ్న ప్రేమికుడు అర్జున్ కల్యాణ్‌ను పిలిచాడు. ఇక్కడ మనోడు శ్రీసత్యపై ప్రేమ కురిపించాడు. ఈయన వచ్చిరాగానే తనకు వచ్చిన అవకాశాన్ని సత్యకు ఇవ్వొచ్చా అని అడిగాడు. దీనికి బిగ్‌బాస్ నో చెప్పడంతో తండ్రి నుంచి వీడియో మెసేజ్ అందుకున్నాడు. తర్వాత బిగ్‌బాస్ ఇనయాను పిలిచాడు. కానీ అప్పటికే బ్యాటరీ ఛార్జ్ 30 శాతం మాత్రమే వుండటంతో ఇనయా ఏదైనా 25 శాతం వున్నదే ఎంచుకోవాలని కండీషన్ పెట్టాడు. దీంతో ఆమె ఫోటో ఫ్రేమ్ ఆప్షన్ ఎంచుకుంది. చివరికి బ్యాటరీ ఛార్జింగ్ 5 శాతం మాత్రమే వుండటంతో దాన్ని మళ్లీ రీచార్జ్ చేయడానికి బిగ్‌బాస్ ఫైమాకి టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఫైమా ఇంగ్లీష్‌లో కొన్ని సినిమాల పేర్లు చెబితే.. అదేం సినిమానో ఇంటి సభ్యులు గెస్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఫైమా వచ్చి రానీ ఇంగ్లీష్‌లో మాట్లాడి నవ్వులు పూయించింది. దానిని ఇంటి సభ్యులు ఎలాగో గుర్తించి ఆన్సర్ చేశారు. దీంతో బ్యాటరీ 85 శాతం పెరిగింది.
అనంతరం శ్రీసత్యను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు బిగ్‌బాస్. ఆమె అమ్మతో వీడియో తీసుకుంది. తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. శ్రీసత్య కంటతడిపెట్టింది. ఇందుకు 35 శాతం బ్యాటరీ అయిపోయింది. తర్వాత కెప్టెన్ రేవంత్‌ని బిగ్‌బాస్ నుంచి పిలుపురాగా.. ఆయన నిద్రపోవడంతో ఐదు శాతం బ్యాటరీ కట్ అయ్యింది. దీంతో బాలాదిత్యను పిలిచాడు బిగ్‌బాస్.. ఆయన 50 శాతం వున్న ఆడియో కాల్ ఎంచుకుని భార్యా కూతురితో మాట్లాడారు. వీరిద్దరిని చూడగానే బాలాదిత్య బాగా ఎమోషనల్ అయ్యాడు.
ఇదిలా వుండగా మన శ్రీహాన్ త్యాగమూర్తిలా బిల్డప్ ఇద్దామనుకుంటే ఇంకేదో అవ్వడంతో పూర్తిగా డీలా పడిపోయాడు. ఇంటి సభ్యులకు ఛాన్స్ రావాలనే ఉద్దేశంతో ఫుడ్ ఆప్షన్ ఒకటే ఎంచుకుని పేరెంట్స్‌తో మాట్లాడలేకపోయాడు శ్రీహాన్. బ్యాటరీని రీచార్జ్ చేసే ఆప్షన్ వుందని తనకు ముందే చెప్పలేదంటూ తెగ బాధపడిపోయాడు.
ఇప్పటి వరకు శ్రీహాన్, సుదీప, ఆదిరెడ్డి, గీతూ, ఇనయా, అర్జున్, శ్రీసత్య, బాలాదిత్య, ఫైమా, రేవంత్‌లకు సర్ప్రైజ్ టాస్క్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇంకా.. కీర్తి, మెరీనా, రోహిత్, రాజ్‌శేఖర్, వాసంతి, ఆర్జే సూర్యలకు ఇంకా అవకాశం రాలేదు. దీంతో వారు తమకు అవకాశం దక్కుతుందో లేదోనని ఆందోళనగా కనిపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments