ఓ వ్యక్తి ప్రాణం కోసం పుణె నుంచి హైదరాబాద్‌కు గంటలో లంగ్స్ తరలింపు
- IndiaGlitz, [Monday,August 17 2020]
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో మనిషి ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించడమే కష్టంగా ఉంది. అలాంటిది.. వ్యక్తి ఊపిరితిత్తులు మాత్రం కొన్ని వందల కిలో మీటర్లు గంటలో ప్రయాణించి.. ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టాయి. అసలు విషయంలోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్‌లోని కిమ్స్ హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్నాడు. లంగ్స్ ప్లాంటేషన్ జరిగితే కానీ అతను బతికే అవకాశం లేదు. దీంతో బాధితుడు అవయవ మార్పిడి కోసం జీవన్‌దాన్ ఫౌండేషన్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.
మరోవైపు పుణెలో ఓ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు బాధితుడి నుంచి అవయవాలను సేకరించారు. అప్పటికే అవయవ దానం కోసం హైదరాబాద్ వ్యక్తి ఫౌండేషన్‌లో పేరు నమోదు చేసుకుని ఉండటంతో ఊపిరి తిత్తులను హైదరాబాద్ తరలించాలని వైద్యులు నిర్ణయించారు. తెలంగాణ జీవన్‌దాన్ ఫౌండేషన్ ఇన్చార్జి స్వర్ణలత నేతృత్వంలో ఊపిరితిత్తుల తరలింపునకు రంగం సిద్ధమైంది.
అవయవాలను ఒక పెట్టెలో భద్రపరిచి పుణె నగర ట్రాఫిక్ పోలీసులు, విమానాశ్రయ అధికారుల సాయంతో తక్షణమే ఆ పెట్టెను ఆదివారం ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి తరలించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సాయంతో విమానాశ్రయం నుంచి కిమ్స్‌కు తరలించారు. వెంటనే కిమ్స్ వైద్యులు చికిత్స ద్వారా బాధితుడికి అవయవ మార్పిడి చేసి ప్రాణం కాపాడారు. ఒక మనిషి ప్రాణం కాపాడేందుకు 560 కిలో మీటర్లను గంట వ్యవధిలోనే ఊపిరితిత్తులను చేరవేసిన ప్రతి ఒక్కరికీ ఆసుపత్రి వర్గాలు ధన్యవాదాలు తెలిపాయి.