ఎలక్టోరల్ బాండ్లతో రూ.16వేల కోట్ల విరాళాలు.. బీజేపీకి భారీ ఎదురుదెబ్బ..
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు అందించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బాండ్లపై తీవ్ర చర్చ మొదలైంది. రాజకీయ పార్టీలు సంస్థల నుంచి ప్రైవేట్ వ్యక్తుల నుంచి విరాళాలు సేకరిస్తాయి. ఆ విరాళాలతోనే పార్టీలు నడుపుతాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం 2018లో ఎలక్టోరల్ బాండ్లు స్కీమ్‌ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైనా ఓ రాజకీయ పార్టీకి బాండ్‌ల రూపంలో డబ్బుని విరాళంగా ఇవ్వచ్చు. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటివరకు 30 విడతల్లో దాదాపు 28వేల ఎన్నికల బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది.
దీంతో వీటి మొత్తం విలువ రూ.16,518 కోట్లుగా ఉన్నట్లు ఇటీవల కేంద్రమంత్రి పంకజ్ చౌధరీ లోక్‌సభలో తెలిపారు. అలాగే ఎలక్షన్ కమిషన్ అందించిన వివరాల ప్రకారం ఈ ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ద్వారా మొత్తం రూ.16437 కోట్ల విరాళాలు సమకూరాయి. ఇందులో 60 శాతం పైగా అధికార బీజేపీకే చేరాయి. ఇందులో రూ.10,122కోట్లు బీజేపీకి విరాళాల ద్వారా అందాయి. ఒక్క 2022-2023 ఏడాదిలోనే బీజేపీకి రూ.1300 కోట్లు వచ్చాయి. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4,957 మంది దాతల ద్వారా కాషాయం పార్టీకి రూ.614 కోట్ల విరాళాలు లభించాయి.
ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి మొత్తం రూ. 1547 కోట్లు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ. 823 కోట్లు,
బిజూ జనతాదళ్ రూ.773 కోట్లు, డీఎంకే రూ.617కోట్లు, వైసీపీ రూ.382.44 కోట్లు, బీఆర్ఎస్ రూ.383 కోట్లు సీపీఎం రూ.367కోట్లు, ఎన్సీపీ రూ. 231 కోట్లు,
టీడీపీ రూ.146 కోట్లు, బీఎస్పీ రూ.85 కోట్లు, సీపీఐ రూ 13 కోట్లను ఎన్నికల బాండ్ల ద్వారా సమీకరించాయి. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయం బీజేపీకే పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని.. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో విచ్చలవిడిగా విరాళాలు సేకరించేందుకు వీలు లేకుండా పోయింది. ఇది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలపై పెను ప్రభావం చూపించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments