LPG Cylinder Price : సామాన్యులకు కేంద్రం మరో షాక్.. మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెంపు, ఎంతో తెలుసా..?
- IndiaGlitz, [Wednesday,July 06 2022]
పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు ప్రస్తుతం దేశంలో బతకలేని పరిస్ధితి నెలకొంది. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా వంట గ్యాస్ ధరల్ని మరోసారి పెంచింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై రూ.50 పెంచింది కేంద్రం . దీనితో పాటు 5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరను కూడా రూ.18 మేర పెంచింది ప్రభుత్వం. కొత్త ధరల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1053కి చేరింది. నిన్నటి వరకు దీని ధర రూ.1003గా వుండేది. అటు హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1055 నుంచి రూ.1105కి చేరుకుంది. జూలై 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.183.50 మేర తగ్గించాయి. అలాగే ఈ రోజు కూడా వాణిజ్య సిలిండర్ ధర ను రూ.8.50 మేర తగ్గించింది కేంద్రం. సవరించిన ధరలు ఈ రోజు నుంచే అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
అచ్చెదిన్ ఆగయా అంటూ కేటీఆర్ సెటైర్లు:
మరోవైపు వంట గ్యాస్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అటు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అచ్చెదిన్ ఆగయా.. చప్పట్లు కొట్టండి’’ అంటూ ప్రధాని మోడీపై పరోక్షంగా సెటైర్లు వేశారు. గృహ వినియోగదారులకు మోడీ సర్కార్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ దుయ్యబట్టారు. దీనితో పాటు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో 35 శాతం ఇళ్లు అక్రమంగా నిర్మించినవే అంటూ ఓ జాతీయ పత్రికలో వచ్చిన వార్తను ఆయన మరో ట్వీట్ చేశారు. మరి గుజరాత్ కు బుల్డోజర్లు వస్తాయా అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. గత కొంతకాలంగా యూపీ, మధ్యప్రదేశ్‌లలోని అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు అక్కడి అధికారులు. దీనిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ఇలా స్పందిస్తున్నట్లుగా కనిపిస్తోంది.