కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీస్లు రద్దు
- IndiaGlitz, [Monday,March 23 2020]
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించిన కేంద్రం తాజాగా.. ఎల్లుండి నుంచి అనగా.. బుధవారం రాత్రి నుంచి దేశీయ విమాన సర్వీసులన్నీ రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్క సరుకు రవాణా విమానాలు తప్ప మిగిలిన సర్వీసులు అన్నీ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మొత్తానికి చూస్తే.. దేశీయ రూట్లలో తిరిగే ప్రయాణికుల విమానాలు నిలిచిపోనున్నాయి.
కాగా.. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపైనా కేంద్రం ఆంక్షలు విధించిన విషయం విదితమే. 22 నుంచి 29వతేదీ వరకు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను నిషేధిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దేశంలోని ఏ ఒక్క విమానాశ్రయంలోనూ ల్యాండ్ అయ్యేందుకు వాటిని అనుమతించరు. కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రైళ్లు నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించిన విషయం విదితమే.