మరింత ప్రియం కానున్న దేశీయ విమాన ప్రయాణం
- IndiaGlitz, [Saturday,May 29 2021]
దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్ 1 నుంచి 13 - 16 శాతం పెంచుతూ శుక్రవారం పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఎగువ పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ. 2,300 నుంచి రూ. 2,600లకు పెరుగగా, 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం రూ. 2,900 ఉండగా అది రూ. 3,300కి పెరగనుంది.
ఇక 60-90 నిమిషాల ప్రయాణానికి రూ.4000, 90-120 నిమిషాల ప్రయాణానికి రూ.4700, 120-150 నిమిషాల ప్రయాణానికి రూ.6100, 180-210 నిమిషాల ప్రయాణానికి 8700 దిగువ పరిమితిగా ఉండనుంది. అలాగే జూన్ 1వ తేదీ నుంచి 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ప్రస్తుత నిబంధనల ప్రకారం సంస్థలు 80 శాతం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ వీలు కల్పించింది.