Sarathi Studio: సారథి స్టూడియోస్‌లో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలు ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో తెలుగు సినిమాకు ఐకాన్‌గా ఇంకా చెప్పాలంటే మొట్ట మొదటి స్టూడియోగా శ్రీ సారథి స్టూడియోస్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి సినిమాలు మొదలుకుని, నేటి సినిమాల వరకు ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవి. మారుతున్న కాలానికి తగట్టు అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో ఈ స్టూడియోను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోనే అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్ ప్రారంభించింది. ఆహ్లాదభరిత వాతావరణంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో డాల్బీ మిక్సింగ్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రారంభించగా.. సౌండ్ డిజైన్ స్టూడియోను మరో సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంబించారు.
ఈ సందర్భంగా శ్రీ సారథి స్టూడియోస్ చైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. "గతంలో ఈ స్టూడియోని మల్టీఫ్లెక్స్ థియేటర్స్‌గా మార్చాలన్న ఆలోచన చేసి, ఆ తర్వాత విరమించుకున్నాం. సినీ స్టూడియోస్ గానే కొనసాగించాలని నిర్ణయించుకున్న అనంతరం షూటింగులకు కావాల్సిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీపడేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకునివచ్చాం. మేము ఈ రోజు ఆరంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్‌లు చాలా చాలా అధునాతనమైనవి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా "కల్కి" అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం" అన్నారు
శ్రీ సారథి స్టూడియోస్ డైరెక్టర్ కె.వి.రావు మాట్లాడుతూ.. "మా స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తే, పోస్ట్ ప్రొడక్షన్స్‌తో సహా సినిమా మొదటి కాపీని సిద్ధం చేసుకునేంతవరకు కావలసిన ఎక్విప్‌మెంట్ అంతా ఉంది.. సినిమా అనగానే సౌండింగ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే అధునాతన టెక్నాలజీని ప్రవేశపెట్టాం" అని చెప్పారు.
ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, ఇంకా పలువురు సినీ ప్రముఖులు, మీడియా ప్రముఖులు పాల్గొని, స్టూడియో యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments