Dog killed:జింక మాంసమని ఎగబడికొన్న జనం.. కట్ చేస్తే ఆ వూళ్లో కుక్క మిస్, ఎలా బయటపడిందంటే..?

  • IndiaGlitz, [Saturday,June 10 2023]

ఇటీవలి కాలంలో కేటుగాళ్లు సులభంగా డబ్బులు సంపాదించేందుకు అందుబాటులో వున్న అన్ని రకాల మార్గాలను వాడేస్తున్నారు. ఎలా కుదిరితే అలా.. జనాన్ని బకరాలను చేసి డబ్బులు గుంజేయాలి. ఇదొక్కటే వాళ్ల టార్గెట్. తాజాగా కుక్క మాంసాన్ని జింక మాంసమని నమ్మించి డబ్బు దండుకున్నారు కేటుగాళ్లు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా అనే గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తి పెంచుకుంటున్న పెంపుడు కుక్క మాయమైంది. దీంతో కుక్కు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకునేందుకు యత్నించారు.

సీసీ టీవీ ఫుటేజ్ పట్టించింది :

సీసీ ఫుటేజ్‌ను విశ్లేషిస్తుండగా.. కుక్కను ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తున్న యవ్వారం వెలుగులోకి వచ్చింది. వీరిని పొట్టపల్లి (కె) గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో పాటు చామన్‌పల్లి గ్రామానికి చెందిన వరుణ్‌గా గుర్తించారు. అనంతరం వీరిని అరెస్ట్ చేసి.. కుక్క గురించి ఆరా తీయగా వాళ్లు చెప్పినదానికి పోలీసులు అవాక్కయ్యారు. కుక్కను చంపేసి.. జింక మాంసం పేరుతో అమ్మేసినట్లు నిందితులిద్దరూ చెప్పారు. దీంతో ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

జింక మాంసం గురించి తెలియకపోవడమే పెట్టుబడి :

సాధారణంగా కోడి మాంసం, గొర్రె మాంసాలను జనం చాలా ఈజీగా గుర్తు పడతారు. అదే జింక మాంసం గురించి తెలిసినవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. దీనినే అదనుగా చేసుకున్న ఈ ఇద్దరు కేటుగాళ్లు కుక్కను చంపి జింక మాంసంగా నమ్మించారు. అసలు బండారం బయటపడటంతో కుక్క మాంసాన్ని జింక మాంసంగా తిన్న వారు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.