Deep Fake: డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు ఎలా గుర్తించవచ్చో తెలుసా..?

  • IndiaGlitz, [Wednesday,May 22 2024]

టెక్నాలజీ పెరిగిన తరుణంలో డీప్ ఫేక్ అంశం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక మంది సెలబ్రెటీలు డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు సంబంధించి డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపాయి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) మనుషులు సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. అయితే దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకుమించి నష్టాలు కూడా ఉన్నాయని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలో డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు, నకిలీలను గుర్తించేందుకు వీలుగా కేంద్రం ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(Press Information Bureau) తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఎలాంటి టెక్నాలజీ అవసరం లేకుండా చిన్న చిన్న అంశాల ఆధారంగా డీప్ ఫేక్ ఫోటోలను గుర్తించొచ్చని ఇందులో పేర్కొంది. ఈ వీడియోలు, ఫోటోలను పూర్తిగా పరిశీలిస్తే వింత వింత లైటింగ్, నీడలు, చిత్రాల్లో అసమానతలు వంటి తప్పులను గుర్తించవొచ్చని చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో డీప్ ఫేక్‌కు సంబంధించి ఒక్కో అంశాన్ని వివరించింది.

ఏఐ ఆధారంగా నకిలీ ఫోటోలో మనుషుల శరీర తీరు వాస్తవానికి విరుద్ధంగా ఉంటుందని కాలి, చేతివేళ్లు అసహజంగా కనిపిస్తాయని పేర్కొంది. అలాగే ఎడిట్ చేసిన ఫోటోల్లో నీడలు తేడాగా ఉంటాయంది. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏది వాస్తవమో, ఏది నకిలీనో కనిపెట్టొచ్చని సూచించింది. డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు, నకిలీలను అడ్డుకునేందుకు కొత్త ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనిపై చట్టం తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా గతేడాది నవంబర్‌లో హీరోయిన్‌ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం విధితమే. ఆ వీడియోలో డీప్‌ నెక్ బ్లాక్ డ్రెస్‌ వేసుకుని రష్మిక లిఫ్ట్‌లోకి వచ్చినట్లు అసభ్యకరంగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రష్మిక ఏంటి ఇలా ఎక్స్‌పోజింగ్ చేస్తుందంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ కాగా.. ఇది ఫేక్ వీడియో అని తేలింది. దీనిపై అన్ని వర్గాల ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. డీప్‌ ఫేక్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.