రాజేంద్రప్రసాద్ కామెడీ హీరో ఎలా
- IndiaGlitz, [Monday,March 08 2021]
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. అనతి కాలంలోనే హాస్య నట కిరీటిగా ఎదిగిన వ్యక్తి రాజేంద్రప్రసాద్. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆయన హవా ఏమాత్రం తగ్గలేదు. ‘జులాయి, సరిలేరు నీకెవ్వరూ’ సినిమాల్లో అద్భుతమైన హాస్యాన్ని పండించారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్లైమాక్స్’. భవానీ శంకర్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తాను డబ్బు విషయంలో మోసపోయిన విషయాలతో పాటు.. కామెడీ హీరోగా అలరించడానికి కారణం.. తదితర విషయాలను రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. తాను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని... ఇండస్ట్రీలో అడుగుపెట్టడాని కంటే ముందు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నట్టు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అక్కడ గోల్డ్ మెడల్ సాధించానని... అయితే, అప్పటికే ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు.. ఇలా ఎంతోమంది అగ్రహీరోలు పరిశ్రమలో ఉన్నారన్నారు. కాబట్టి.. ఇండస్ట్రీలో రాణించాలంటే ఎలాంటి సినిమాల్లో నటించాలి అనే సందేహంలో ఉన్నప్పుడు ఓసారి చార్లి చాప్లిన్ సినిమాలు చూశానన్నారు.
హాస్యభరితమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించాలని అప్పుడే ఫిక్స్ అయ్యానని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అలా కామెడీ హీరోగా అందర్నీ ఆకర్షించానన్నారు. జీవితంలో బాధాకరమైన సంఘటనలంటూ ఏమీ లేవన్నారు. కానీ చాలామంది దగ్గర తాను మోసపోయానన్నారు. అదీ ముఖ్యంగా డబ్బు విషయంలో రక్త సంబంధీకుల వద్దే తాను మోసపోయానని వెల్లడించారు. కొన్ని సంఘటనల తర్వాత అసలు నేను ఇన్నాళ్లు సంపాదించిన సొమ్ము ఏమైంది అని చూసుకుంటే.. అప్పుడు వాళ్లు తనను మోసం చేసి వెళ్లిపోయారని అర్థమైందని రాజేంద్రప్రసాద్ వివరించారు.