ఈ లక్షణాలున్నాయా? అయితే కరోనాగా అనుమానించాల్సిందే..
- IndiaGlitz, [Monday,May 17 2021]
దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొవిడ్‌తో పాటు దాని లక్షణాలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గతంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి మాత్రమే కొవిడ్ లక్షణాలుగా వైద్యులు పేర్కొన్నారు. అనంతరం వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం, బాడీ పెయిన్స్, వాంతులు, విరోచనాలు, శరీరంపై దద్దుర్లు వంటివన్నీ కొవిడ్ లక్షణాలేనని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లక్షణాల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇప్పుడు కొన్ని కొత్తవి కొవిడ్ లక్షణాల జాబితాలో వచ్చి చేరాయి.
Also Read: బ్లాక్ ఫంగస్ రాకుండా చూడాలంటే ఇలా చేయండి..
నోరు తడారిపోయినా, నాలుకపై దురదగా అనిపించినా కొవిడ్ లక్షణంగా అనుమానించాలని కర్ణాటక టాస్క్‌ఫోర్స్ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు తెలిపారు. వైద్యులు కూడా రోగి ఆరోగ్య స్థితిగతులను పరీక్షించే క్రమంలో.. నాలుక, నోటిలో మార్పులను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. ఈ తరహా ఇన్ఫెక్షన్‌కు బ్రిటన్, బ్రెజిల్, డబుల్ మ్యుటెంట్ వేరియంట్లే కారణమై ఉండొచ్చని అంచనా వేశారు. నోటి అల్సర్లు, జ్వరం లేకున్నా నీరసంగా ఉండటాన్ని కూడా కొవిడ్ లక్షణాలుగా సందేహించాలన్నారు.
కాగా.. కరోనా కేసుల సంఖ్య గత నాలుగు రోజులుగా కాస్త తగ్గుతూ వస్తోంది. నాలుగు రోజులకు ముందు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవి. నాలుగు రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దేశంలో కొత్తగా 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 4,106 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 35,16,997 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 2.49 కోట్లకు చేరుకుంది. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 2,74,390 మంది కరోనాతో మృతి చెందారు.