BRS Party: బీఆర్ఎస్ పార్టీకి 'డూ ఆర్ డై'.. తెలంగాణ నినాదం ఫలిస్తుందా..?

  • IndiaGlitz, [Friday,January 05 2024]

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు చావోరేవో కానున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బలంగా ఎదుర్కోవాలంటే చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీ సీట్లు గెలవాలని. లేదంటే పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది. అందుకే ఈ ఎన్నికలపై పార్టీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలి అంటే.. తెలంగాణ అన్న మాట ధైర్యంగా ఉచ్చరించబడాలంటే.. కేంద్ర ప్రభుత్వంతో కలబడాలంటే కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది బీఆర్‌ఎస్‌కి మాత్రమే అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెరపైకి తెలంగాణ సెంటిమెంట్..

అయితే కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించారు. దీంతో పేరులోనే తెలంగాణ పదం తొలగించడంతో విమర్శలు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి పేరు మార్పు అంశం కూడా ఓ కారణమైంది. ఇప్పుడు కూడా పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినపడాలంటే బీఆర్ఎస్‌కే ఓటేయాలని గులాబీ నేతలు చెబుతున్నారు. అయితే జాతీయ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ కోసమే ఎలా పనిచేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

జాతీయ అంశాల ఆధారంగా..

2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి 2019 ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. అధికారంలో ఉండి కూడా కేవలం 9 ఎంపీ సీట్లు మాత్రమే సాధించింది. నాలుగు సీట్లు బీజేపీకి, మూడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. అయితే ఇప్పుడు అధికారంలో కూడా లేదు.. ప్రతిపక్ష పార్టీగా ఎంపీ ఎన్నికలను ఎదుర్కొంంటుంది. ఎంపీ ఎన్నికలంటే సాధారణంగా జాతీయ అంశాల ఆధారంగా జరుగుతాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కలిసి జరిగితే రాష్ట్ర అంశాలే ప్రధానంగా ఉంటాయి. కానీ కేవలం లోక్‌సభ ఎన్నికలే జరిగితే ప్రధాని అభ్యర్ధి ఎవరనే దానిపై ప్రజలు పార్లమెంట్ అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. మోదీ మూడో సారి ప్రధానిగా కొనసాగాలా..? లేకపోతే ఇండియా కూటమి అభ్యర్థికి అవకాశం ఇవ్వాలా..? అనే దానిపై ఓటింగ్ జరుగుతుంది. ఇది కాంగ్రెస్, బీజేపీలకు అడ్వాంటేజ్ అవుతుంది.

ప్రజలు నమ్ముతారా..?

ఇప్పుడు ఇదే బీఆర్‌ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతుంది. అందుకే తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణకు న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిందేనని ప్రజలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. కానీ బీఆర్ఎస్ అని జాతీయ పార్టీగా మార్చి తెలంగాణ కోసం కొట్లాడుతామని చెప్పడం ప్రజలు నమ్మేలా కనపడటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌గా పార్టీ పేరు మార్చి ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా మహారాష్ట్ర మీద ఎక్కువ దృష్టి పెట్టారు.

ఇతర రాష్ట్రాల్లో పోటీకి దూరం..

మహారాష్ట్ర, తెలంగాణలో కలిపి 30-40 సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని భావించారు. కానీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఇతర రాష్ట్రాల గురించి ఆలోచించడమే మానేశారు. ముందు స్వరాష్ట్రంలో చెప్పుకోదగ్గ సీట్లు గెలిస్తే చాలనే ఆలోచనకు వచ్చారు. అదీ కాకుండా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించలేరు. దీంతో ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అందుకే తెలంగాణకు తామే రక్షకులం అనే నినాదంలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం చూపించని తెలంగాణ సెంటిమెంట్ లోక్‌సభ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.