విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దు: అమిత్ షాకు పవన్ వినతి
- IndiaGlitz, [Wednesday,February 10 2021]
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఆవరణలో ఈ సమావేశం జరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయవద్దంటూ అమిత్ షాకు వినతి పత్రం అందజేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎంతోమంది పోరాటానికి చిహ్నమని వినతిపత్రంలో పవన్ పేర్కొన్నారు. 32 మంది మానవ జీవితాల త్యాగం ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవిర్భవించిందన్నారు. సుమారు 18,000 మంది శాశ్వత ఉద్యోగులు, 20,000 మంది కాంట్రాక్టులు కార్మికులు ప్రస్తుతం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారన్నారు.
మరో లక్ష మంది ప్రజలు ఉక్కు కర్మాగారం మీద పరోక్షంగా ఆధారపడ్డారని పవన్ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ప్లాంట్ యొక్క పనితీరుకు ప్రాథమిక కారణం ముడిసరుకు లేకపోవడమేనని తెలిపారు. రూ.3 వేల కోట్లకు నికర నష్టాలు అంచనా రూపొందించారన్నారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులను ప్రైవేటీకరించే చర్యను పున: పరిశీలించాలని కోరారు. గనులను కేటాయించడం ద్వారా రుణభారాన్ని తగ్గించాలని అభ్యర్ధిస్తున్నానని అమిత్ షాకు ఇచ్చిన వినతి పత్రంలో పవన్ కల్యాణ్ కోరారు.