నేను దేవుడిని కాదు...నా పై అభిమానం చూపించాలంటే అలా...చేయండి - ఎన్టీఆర్
- IndiaGlitz, [Friday,August 12 2016]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్. మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన జనతా గ్యారేజ్ ఆడియో ఆవిష్కరణోత్సవం అభిమానులు, సినీప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ ఆడియోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆవిష్కరించగా, నిర్మాతలు దిల్ రాజు, పి.వి.పి, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ ముగ్గురు జనతా గ్యారేజ్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ...ఎన్టీఆర్, కొరటాల శివ, దేవిశ్రీప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్....ఇలా నాకు బాగా కావాల్సిన వాళ్లు కలిసి చేసిన సినిమా ఇది. సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్, కొరటాల శివ, దేవిశ్రీప్రసాద్ ఈ కాంబినేషన్ అద్భుతాన్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ...మంచి లిరిక్స్ రాయించుకునే సంస్కారవంతుడు కొరటాల శివకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఈ సినిమాలో మంచి సిట్యువేషన్స్ క్రియేట్ చేసి నాతో మంచి అవుట్ పుట్ తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆరు పాటలు రాసాను. ఈ పాటలకు ఫ్యాన్స్ & మీడియా నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇక ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే...మనందరికి మాస్ హీరోగా, మంచి డాన్సర్ గానే తెలుసు. ఎన్టీఆర్ ని దగ్గర నుంచి చూసాకా తెలిసింది ఆయన మ్యూజిక్ లవర్. అలాగే సాహిత్యం పై మక్కువ ఎక్కువ. నేను రాసిన పాటల్లో పదాలను ఎన్టీఆర్ నాకు గుర్తు చేయడం మరచిపోలేని అనుభూతి కలిగించింది. ఈ చిత్రానికి పూర్తి స్ధాయిలో అన్ని పాటలు రాయడం ఆనందంగా ఉంది. దేవిశ్రీ ఈ మూవీకి మరోసారి అద్భుతమైన సంగీతం అందించారు అన్నారు.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ....పెద్ద ఎన్టీఆర్ తో నటించే అవకాశం రాకపోయినా తారక్ అన్నతో నటించడం ఆనందంగా ఉంది. తారక్ ఒక గూగుల్ లాంటివాడు. అన్ని విషయాల మీద తారక్ కి పూర్తి అవగాహన ఉంది. డ్యాన్స్ అదరగొట్టేస్తాడు. అలాగే... ఐదు పేజీల డైలాగ్ ను సైతం ఈజీగా చెప్పేస్తాడు. ఒక మనిషిలో ఇన్ని ఎలా వచ్చాయి అంటే పెద్ద ఎన్టీఆర్ ఆశీస్సుల వలనే ఎన్టీఆర్ లో ఇంత టాలెంట్ ఉంది అనుకుంటున్నాను అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...జనతా గ్యారేజ్ షూటింగ్ టైమ్ లో తారక్ ఈ సాంగ్స్ వినిపించాడు. సాంగ్స్ విన్న వెంటనే జనతా గ్యారేజ్ షూర్ షాట్ అవుతుంది అనిపించింది. సింహాద్రిలా ఈ సినిమా రాబోతుంది. తారక్ కెరీర్ లో జనతా గ్యారేజ్ నెంబర్ 1 చిత్రంగా నిలుస్తుంది. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో బ్లాక్ బష్టర్స్ అందించిన కొరటాల శివ ఈ సినిమాతో ఇంకో రేంజ్ లో ఉంటాడు. దేవిశ్రీప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. అందుకనే ఇంత మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు. గబ్బర్ సింగ్, మగధీర సినిమాలు పెద్ద సినిమాలు అవుతాయి అని ట్రైలర్ చూడగానే అనిపించింది. అలా జనతా గ్యారేజ్ కి కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా జనతా గ్యారేజ్ పెద్ద హిట్ అవుతుంది అన్నారు.
రైటర్ వక్కంతం వంశీ మాట్లాడుతూ...ఎన్టీఆర్, శివ నా మనసుకు బాగా దగ్గరైన వ్యక్తులు. సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్ తో సత్తా ఉన్న రైటర్ & డైరెక్టర్ కొరటాల శివ జనతా గ్యారేజ్ తీసారు. దేవి గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలో ప్రణామం అనే సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. జనతా గ్యారేజ్ తో పాత రికార్డ్స్ అన్ని రిపేర్ అయిపోవాలి అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ...1974లో లెజెండ్ & మనందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ సినిమాలో డబ్బింగ్ చెప్పాను. ఆతర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించాను. బాలయ్యతో రౌడీ ఇన్ స్పెక్టర్, కళ్యాణ్ రామ్ తో పటాస్, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్...ఇలా నందమూరి హీరోలతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ఈరోజే డబ్బింగ్ చెప్పాను. డైరెక్టర్ శివ గార్కి ఈ చిత్రం హ్యాట్రిక్ అవుతుంది. మోహన్ లాల్ గార్కి ఎన్నో సినిమాల్లో డబ్బింగ్ చెప్పాను. ఆయనతో కలిసి ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పిరియన్స్. తెలుగు ఇండస్ట్రీలో ఒక గ్రేట్ ఫిల్మ్ గా జనతా గ్యారేజ్ నిలుస్తుంది అన్నారు.
నిత్యామీనన్ మాట్లాడుతూ... చాలా సార్లు చాలా మంది ఎన్టీఆర్ తో ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని అడిగేవారు. ఫైనల్ గా తారక్ తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కమర్షియల్ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు కొరటాల శివ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ....ఈ సినిమా నాకు చాలా స్పెషల్.తారక్ ని నేను అన్నయ్య అని పిలుస్తాను. అన్నయ్యతో నా రిలేషన్ షిప్ చాలా స్పెషల్. ఎందుకంటే... రైటర్ గా అన్నయ్యకి బృందావనం సినిమాకి వర్క్ చేసాను. అప్పటికి నేను ఎవరో తెలియదు. కానీ...ఇదే వేదిక పై మీ అందరికీ నన్ను పరిచయం చేసారు. కొరటాల శివ అంటే పది మందికి తెలిసింది అప్పుడే. అందుకే ఎన్టీఆర్ తో సినిమా అంటే నాకు స్పెషల్. ఆయన కోసం ఎక్కువ రాస్తాను. ఆయన ఎనర్జికి తగ్గట్టు రాయాలి అని బాగా ఆలోచించి రాస్తాను. ఈ జనతా గ్యారేజ్ తో బ్లాక్ బష్టర్ కొట్టి ఈ రిలేషన్ షిప్ ఇలాగే కొనసాగిస్తాను.
కెమెరామన్ తిరు తన ఎక్స్ ట్రార్డినరీ వర్క్ తో ప్రతిరోజు సినిమా స్ధాయిని పెంచేవారు. రామజోగయ్య గారు నాకు భవిష్యత్ లో నా సినిమాలకు చాలా పాటలు రాయాలి అని కోరుకుంటున్నాను. దేవి మ్యూజిక్ కి ఫ్యాన్ ని. ఈ సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చినందుకు దేవికి థ్యాంక్స్. మోహన్ లాల్, ఎన్టీఆర్, సాయికుమార్ నటిస్తుంటే అలా చూస్తుండిపోయేవాడిని. ఇంత గొప్ప నటులతో నేను సినిమా తీస్తున్నానా అనుకునేవాడిని. మైత్రీ మూవీ మేకర్స్ సినిమా కోసం ఏదైనా చేయగలరు. వాళ్లు ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించాలి. సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ వస్తుంది. ఖచ్చితంగా బ్లాక్ బష్టర్ అవుతుంది అన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ...అభిమానుల రుణం తీర్చుకోలేనిది. అందుకే అభిమానుల రుణం తీర్చుకోవడం కోసం మళ్లీ మళ్లీ పుట్టాలని ఉంది. ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఆ మహానుభావుడికి మనవడుగా పుట్టడం జరిగింది. నా మనసులో మాటలు చెప్పాలంటే....నేను మాట్లాడడం నన్ను నేను తగ్గించుకున్నట్టు మీకు అనిపించవచ్చు కానీ... మీ అండ ఉంటే నన్ను నేను తగ్గించుకున్నట్టు కాదు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. నా 12 సంవత్సరాల జీవితం కళ్ల ముందు కనిపిసిస్తుంది. నిన్నుచూడాలని, స్టూడెంట్ నెం1, ఆది సింహాద్రి...ఇలా సక్సెస్ వస్తుంటే బాగానే ఉంది అనిపించింది. చిన్న వయసు కదా అర్ధం కాలేదు. ప్రతి మనిషి క్రిందకి పడితేనే జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడప్పుడు దేవుడు మొట్టికాయలు వేసి కిందకి పంపిస్తాడు. చాలా రోజులు అర్ధం కాలేదు.
ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు అభిమానులు ఎంత బాధపడ్డాలో నాకు తెలుసు. ఆ టైమ్ లో నాలో నేను కుమిలిపోయాను. ఒకరోజు వక్కంతం వంశీ నాకో కధ చెప్పాడు. ఆ సినిమా పేరే టెంపర్. వంశీ కథ చెప్పినప్పుడు దూరంగా ఒక వెలుగు కనిపించింది. ఇది బాగుంటుందేమో అనిపిచింది. పూరి లాంటి దర్శకుడు కథ రాసే కేపాసిటి ఉన్నావంశీ చెప్పిన కథతో సినిమా చేద్దాం అనడం సినిమా చేయడం జరిగింది. ఆతర్వాత నాన్నకు ప్రేమతో...గెటప్ చూసి చాలా మంది భయపడ్డారు. మీ అందరి నమ్మకంతో నా గమ్యం మళ్లీ దగ్గరయ్యింది. కానీ..ఫైనల్ గా అర్ధం అయ్యింది జనతా గ్యారేజ్ అని. మనం ఏదీ ప్లాన్ చేయలేం. రెండు సంవత్సరాల క్రితం శివ గారు ఈ కథ చెప్పారు. ప్లాప్ సినిమాల్లో బిజీగా ఉండి శివ గారి కథ విన్నాను. పుష్కరం తర్వాత అద్భుతమైన చిత్రం శివతో చేయాలి అని రాసిపెట్టేసాడేమో ఆ దేవుడు. అందుకే శివతో సినిమా ఇప్పుడు కుదిరింది.
చాలా మంది తక్కువ మంది దర్శకులు మాత్రమే కథ రాసుకోగలరు. అలా కథలు రాసుకోగల అతి తక్కువ మంది దర్శకుల్లో మా కొరటాల శివ ఉండడం సంతోషంగా ఉంది. ఒక కథ రాస్తాడు దానికి ఒకే హీరో అని నమ్ముతాడు. అద్భుతమైన సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ శివ. అలాగే గొప్పనటుడు అంతకంటే మించి గొప్ప మనిషి మోహన్ లాల్ తో నటించే అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను. గొప్పనటుడు కంటే గొప్ప మనిషితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దేవిశ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవిశ్రీ చిరస్ధాయిగా నిలుస్తాడు. ఈ సినిమాతో మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్, సాయికుమార్, బెనర్జి, అజయ్, బ్రహ్మాజీ..వీళ్లందరితో వర్క్ చేయడం ఆనందంగా కలిగించింది. మా నిర్మాతలను చూస్తే..అమర్ అక్బర్ ఆంటోని సినిమా గుర్తుకువస్తుంది. మంచి మనసున్న మనుషులు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేయాలనుకుంటున్నాను.
నాకు బాగా ఇష్టమైన కెమెరామెన్ పి.సి.శ్రీరామ్. ఆయన దగ్గర అసోసియేషన్ గా వర్క్ చేసిన తిరు నా సినిమాకి అద్భుతంగా వర్కి చేసినందుకు ధ్యాంక్స్. 12 సంవత్సరాల తర్వాత రెండు రాష్ట్రాలకు పుష్కరాలు వచ్చాయ. ఈ సందర్భంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన వారిని అచ్చుతన్నతంగా తిరిగి పంపించాలి. ఆ బాధ్యత నా అభిమానులందరికీ ఉంది అని గుర్తుచేస్తున్నాను. ముఖ్యంగా నా అభిమానులకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏమిటంటే...నాన్నకు రిలీజ్ తర్వాత నేను ఎక్కడో పేపర్లో చూసాను. నా ఫోటోకు పాలతో అభిషేకం చేస్తున్నారు. నేను దేవుడిని కాదు నేను మీ తమ్ముడిని. మీ అన్నయ్యని. నాపై అభిమానం చూపించాలనుకుంటే నా ఫోటో పై వేసే ఆ పాల పేకెట్ ని అనాధ శరణాలయంలో ఇస్తే ఆనందిస్తాను. అలాగే నాన్నకు ప్రేమతో..సినిమా టైమ్ లోనే రిలీజ్ రోజు మూగ జంతవును బలి ఇవ్వడం జరిగింది. లా చేయడం కరెక్ట్ కాదు. అన్నదానం చేయండి అంతే కానీ..జంతువులను బలి ఇవ్వద్దు. నేను చెప్పిన ఈరెండు పాటిస్తారని ఆశిస్తున్నాను నమ్ముతున్నాను. అభిమానులకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను అన్నారు.
ఈ కార్యక్రమంలో పి.వి.పి, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, వక్కంతం వంశీ,దేవిశ్రీప్రసాద్ , అజయ్, బెనర్జి, రాజీవ్ కనకాల, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.