అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు: ఈటల
- IndiaGlitz, [Tuesday,March 23 2021]
కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని అంతా రిలాక్స్ అవుతున్న తరుణంలో మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకూ రెండు వందలకు పరిమితమైన కేసులు తాజాగా భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ప్రజలకు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్యశాఖపై తాజాగా ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యమని మంత్రి ఈటల అన్నారు. కోవిడ్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఈటల ప్రజలను కోరారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, పక్క రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు. కరోనా కట్టడికి పక్కాగా చర్యలు తీసుకోవాలని, రోజుకు 50వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.