పుట్టినరోజే కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత

  • IndiaGlitz, [Wednesday,June 10 2020]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎవర్నీ వదలటం లేదు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ, ప్రజాప్రతినిధుల వరకూ ఎవర్నీ వదలకుండా కాటేసుకుంటూ పోతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాయి. తాజాగా తమిళనాడు డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అంబజగన్ కన్నుమూశారు. కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామి కూడా ట్విట్టర్‌లో ప్రకటించి.. ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మరోవైపు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మృతిపై అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఇవాళ ఆయన పుట్టిన రోజు.. ఆయన బర్త్ డే నాడే ఇలా జరగడంతో అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఎమ్మెల్యే ట్రాక్ రికార్డ్..

ఇదిలా ఉంటే.. 61 ఏళ్ల వయసు గల అంబజగన్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారు. కాగా.. ఈయన డీఎంకే వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపౌక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అంతేకాదు కరుణానిధి నుంచి స్టాలిన్ వరకు ఇద్దరికీ అత్యంత సన్నిహితుడే. 2001లో టీ నగర్ నుంచి.. 2011, 2016లలో జరిగిన ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఈయన ఎమ్మెల్యేగానే కాదు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా కూడా అందరికీ సుపరిచితులే. ఇదిలా ఉంటే.. తమిళనాడులో రోజురోజుకూ కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రోజుకే 700 నుంచి వెయ్యికిపైగానే కేసులు నమోదవుతున్నాయి.