డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలిగిపోయింది. దీంతో ఆ పార్టీ ముఖ్య అభ్యర్థిగా తిరిగి పళనిస్వామినే అధిష్టానం ప్రకటించింది. ఇక డీఎంకే కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరుపుతామని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. జయ మృతి వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేస్తామని వెల్లడించారు. సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీలు పిటిషన్‌పై ప్రభుత్వ తరఫు న్యాయవాదులు సక్రమంగా వాదించడం లేదని విమర్శించారు.
గతంలో జయలలిత మృతిలో దాగిన మర్మాలు బహిర్గతం చేయడానికి ధర్మయుద్ధం చేస్తానని గొప్పలు చెప్పిన పన్నీర్ సెల్వం విచారణ కమిటీ విచారణకు సైతం హాజరు కాలేదని స్టాలిన్ విమర్శించారు.కాగా.. జయ మృతిపై విచారణ జరుపుతున్న కమిటీ తమను తప్పుబట్టే రీతిలో సాగుతోందని ఆరోపిస్తూ అపోలో ఆస్పత్రి యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుని స్టే తెచ్చుకుందని పేర్కొన్నారు. అయితే ఆ స్టేను తొలగించే దిశగా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తగు చర్యలు తీసుకోలేదని కమిటీ అధికారి అయిన జస్టిస్ ఆరుముగసామి ఆరోపణలు చేశారన్నారు. జయ మృతిపై తన డిమాండ్లను అన్నాడీఎంకే ప్రభుత్వం ఆమోదించలేదన్నారు. పన్నీర్‌సెల్వం కేంద్రంలోని బీజేపీ పాలకుల ఒత్తిడికి లొంగి ప్రభుత్వంలో భాగస్వామిగా మారిపోయారని స్టాలిన్ విమర్శించారు.
జయ మృతిపై రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని, మూడు నెలల్లో విచారణ జరిపి నివేదికను సమర్పించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నారు. అయితే కమిటీ ఏర్పాటై 37 నెలలు గడుస్తున్నా నివేదిక మాత్రం ఇవ్వలేదని స్టాలిన్ విమర్శించారు. జయలలిత మృతి కేసులో ప్రధాన నిందితుడు పన్నీర్‌సెల్వం అని ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ చేసిన ఆరోపణ చేసిన విషయాన్ని కూడా స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ముగస్వామి కమిటీ విచారణకు హాజరు కావాలంటూ పన్నీర్ సెల్వంకు సమన్లు పంపినా ఆయన పట్టించుకోలేదన్నారు. జయ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ ధర్మయుద్ధం జరిపిన పన్నీర్‌సెల్వం, తాజాగా సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలంటూ ‘ధర్మయుద్ధం-2’ జరిపి అభాసుపాలయ్యారని స్టాలిన్ విమర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com