close
Choose your channels

Vijayakanth:కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ కన్నుమూత .. తిరిగిరాని లోకాలకు ‘‘కెప్టెన్’’

Thursday, December 28, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఇక లేరు. ఆయన వయసు (71) సంవత్సరాలు. మధుమేహం, శ్వాస సంబంధిత అనారోగ్యంతో గత కొద్దిరోజులుగా చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ (ఎంఐవోటీ ఇంటర్నేషనల్) హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయ్ కాంత్ తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కెప్టెన్ మృతితో తమిళనాడు విషాదంలో కూరుకుపోయింది. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇదీ విజయ్ కాంత్ ప్రస్థానం :

1952 ఆగస్ట్ 25న మధురైలో జన్మించిన విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. తల్లిదండ్రులు కేఎన్ అళగర్ స్వామి, అండాల్ స్వామి, విజయ్ కాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు వున్నారు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన తన పేరును విజయ్ కాంత్‌గా మార్చుకున్నారు. 1979లో 27 ఏళ్ల వయసులోనే ఆయన తెరంగేట్రం చేశారు. కెప్టెన్ నటించిన తొలి సినిమా ‘ఇనిక్కుమ్ ఇలమై’. ఆ చిత్రంలో విలన్ రోల్‌లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాటి నుంచి 2015 వరకు నటిస్తూ వచ్చారు. ఒక దశలో 3 షిఫ్టుల్లోనూ పనిచేసి ఎంతోమందికి ఉపాధి కల్పించారు.

కెరీర్ ఆరంభంలో నిలదొక్కుకోవడానికి కష్టపడిన విజయ్‌కాంత్‌..ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్షన్‌లో నటించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. సుదీర్ఘ కెరీర్‌లో 150కి పైగా సినిమాల్లో నటించారు విజయ్ కాంత్. 1984 ఆయన కెరీర్‌లోనే అద్భుతమైన ఏడాదిగా నిలిచింది. ఆ సంవత్సరం విజయ్ కాంత్ నటించిన దాదాపు 18 సినిమాలు విడుదలవ్వడం ఇండస్ట్రీనే ఆశ్చర్యపరిచింది. పోలీస్ క్యారెక్టర్లంటే ఎంతో ఇష్టపడే విజయ్ కాంత్ తన కెరీర్‌లో 20కి సినిమాల్లో ఆ రోల్‌లో నటించారు. ఆయన నటించని చివరి సినిమా సగప్తం .

కమర్షియల్ చిత్రాల్లో నటించినా తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకున్నారు విజయ్ కాంత్. తోటి హీరోల్లా కాకుండా పారితోషికాన్ని ముందు తీసుకునేవారు కాదు. నిర్మాతలు ఆర్ధిక ఇబ్బందుల్లో వుంటే వారి నుంచి రెమ్యునరేషన్ తీసుకునేవారు కాదట. అంతేకాదు.. ఇన్నేళ్ల కెరీర్‌లో విజయ్ కాంత్ తమిళంలో తప్పించి మరే ఇతర భాషల్లోనూ నటించలేదు. కానీ ఆయన సినిమాలు తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లో డబ్ అయి అక్కడా మంచి విజయాలు సాధించాయి. విప్లవాత్మకమైన సినిమాల్లో నటించిన విజయ్‌కాంత్‌ను పురాచీ కళింగర్ (విప్లవాత్మక నటుడు) అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. అలాగే తన 100వ చిత్రం ‘‘కెప్టెన్ ప్రభాకరన్’’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో కెప్టెన్ ఆయన ఇంటి పేరైంది. తన నటనతో రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు గట్టి పోటీనిచ్చారు .

హీరోగా సక్సెస్ అయిన విజయ్ కాంత్ దర్శకుడు, నిర్మాతగానూ రాణించారు. తన బంధువు ఎల్ కే సుధీశ్‌తో కలిసి వల్లారసు, నరసింహ, సగప్తం సినిమాలు నిర్మించారు. 1994లో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరరీ అవార్డ్, 2001లో కలైమామణి, 2011లో ఆనరరీ డాక్టరేట్ సహా పలు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. విజయ్ కాంత్ నటించిన చిత్రం విరుధగిరి.

తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తమిళనాడు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విజయ్ కాంత్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2016లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. అయితే విజయ్ కాంత్ గత కొన్నేళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. మనదేశంతో పాటు విదేశాల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఆయన చికిత్స పొందారు. ఈ క్రమంలో గత నెల 18న జలుబు, దగ్గుతో బాధపడుతూ మయత్ ఆసుపత్రిలో చేరారు. 23 రోజుల పాటు చికిత్స తీసుకుని డిసెంబర్ 11న డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి అనారోగ్యానికి గురైన కెప్టెన్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment