దూరం.. దూరం.. జగన్‌లాగే ‘డీకే’ కొత్త పార్టీ!?
- IndiaGlitz, [Sunday,September 15 2019]
కర్ణాటక నాట మరో కొత్త పార్టీ పుడుతోందా..? ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన డీకే శివకుమార్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? సేమ్ టూ సేమ్ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లాగా కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేసి కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నారా..? ఇదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అంతేనా..? అంటే కన్నడనాట తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది.
అచ్చం జగన్ లాగే..!
కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, పార్టీకి విధేయుడిగా.. కట్టప్పలా కాంగ్రెస్‌కు కాపలా ఉంటున్న డీకే శివకుమార్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అచ్చం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాటలోనే కాంగ్రెస్‌కు దూరమై డీకే కూడా కొత్త పార్టీ స్థాపించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కన్నడ నాట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాగా.. ప్రస్తుతం ‘మనీ లాండరింగ్’ ఆరోపణలపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఆయన కుమార్తెను కూడా ఈ వివాదంలో లాగింది సీబీఐ.
కర్మ, కర్మ, క్రియ ఆయనే!
ఇదిలా ఉంటే.. ఆది నుంచి కన్నడ నాట కాంగ్రెస్‌లో డీకే కీలక నేతగా.. ట్రబుల్ షూటర్‌గా ఉన్నారు. మొదట సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మొదలుకుని.. ఆ తర్వాత జేడీఎస్-కాంగ్రెస్ చేయి కలిపి మరోసారి సర్కార్‌ను ఏర్పాటు చేయడంలో కర్త, కర్మ, క్రియ అన్నీ డీకేనే. అంతేకాదు.. కర్ణాటకలో సంక్షోభంలో ఉన్నప్పుడు దగ్గరుండి డీకే అన్నీ చూసుకున్నారు.
12 జిల్లాల్లో పర్యటించి..!
ప్రస్తుతం మనీలాండరింగ్ వివాదం మునిగితేలుతున్న డీకే.. ఈ వివాదం కాస్త సద్దుమణిగాక రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పర్యటించి.. సొంత సామాజిక వర్గమైన ‘వక్కళిక’ కమ్యూనిటీ ప్రజలను కలిసి తన మనసులోని మాటను బయటపెడతారని తెలుస్తోంది. ఇదే జరిగితే.. కన్నడనాట కాంగ్రెస్ ఖాళీ అయినట్లేనని.. ఉన్న కాస్త కూస్తో కాంగ్రెస్ కేడర్ కూడా డీకే ఖాతాలోకే పోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందో.. ఏ మాత్రం ఈ పార్టీ విషయం వర్కవుట్ అవుతుందో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.