బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి డీకే అరుణ, పురందేశ్వరి..
- IndiaGlitz, [Saturday,September 26 2020]
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని జేపీ నడ్డా ప్రకటించారు. జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇరువురు మహిళా నేతలు స్థానం దక్కించుకోవడం విశేషం. 70 మంది సభ్యులతో జేపీ నడ్డా కొత్త టీమ్‌ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం దక్కింది. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలుగా డీకే అరుణ నియమితులయ్యారు. తెలంగాణ నుంచి ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ నియమితులయ్యారు.
ఏపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమించారు. ఏపీకి చెందిన సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగానే కొనసాగనున్నారు. మొత్తంగా 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులుగా.. 13 మంది జాతీయ కార్యదర్శులుగా.. ముగ్గురు జాయింట్ జనరల్ సెక్రటరీలుగా జేపీ నడ్డా నియమించారు. వీటితో పాటు బీజేపీకి చెందని ఇతర విభాగాలకు సైతం అధ్యక్షులను, ఇన్‌చార్జులను నియమించారు.
రామ్ మాధవ్, మురళీధర్ రావులకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు దక్కలేదు. కొన్ని రోజులుగా వీరికి ప్రధాన కార్యదర్శ పదవులు ఇవ్వకపోవచ్చని ఊహాగానాలు జోరుగా వినిపించాయి. ఆ ఊహాగానాలన్నీ నేడు నిజమయ్యాయి. కాగా.. జీవీఎల్ నర్సింహారావుకు జాతీయ అధికార ప్రతినిధి హోదా దక్కలేదు. ప్రస్తుతం జీవీఎల్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.