Divyavani : ఈటల రాజేందర్‌తో దివ్యవాణి భేటీ.. త్వరలో బీజేపీలోకి, సౌత్‌లో ఎక్కడైనా రెడీ అంటూ సంకేతాలు
Send us your feedback to audioarticles@vaarta.com
అలనాటి సినీనటి దివ్యవాణి గురువారం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈరోజు హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని రాజేందర్ ఇంటికి వెళ్లిన దివ్యవాణి ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం దివ్యవాణి మాట్లాడుతూ.. బీజేపీలో చేరాల్సిందిగా తనను ఆ పార్టీ నేతలు సంప్రదించారని, ఈ నేపథ్యంలోనే చేరికల కమిటీ కన్వీనర్‌గా వున్న రాజేందర్‌తో భేటీ అయ్యానని చెప్పారు. బీజేపీలో చేరే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని దివ్యవాణి వెల్లడించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగానే వుందని.. తనకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోనూ అనుబంధం వుందన్నారు. ఈ క్రమంలో దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా పనిచేస్తానని.. బీజేపీని బలోపేతం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని దివ్యవాణి వెల్లడించారు.
వెళ్తూ వెళ్తూ టీడీపీపై విమర్శలు:
నిన్న మొన్నటి వరకు ఏపీ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌గా చంద్రబాబును కానీ, నారా లోకేష్‌ను ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడేవారు సినీనటి దివ్యవాణి. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వెళుతూ వెళుతూ.. తనను టీడీపీ నేతలు మోసం చేశారని, అక్కడ ఓ వర్గం వారిది మాత్రమే పెత్తనమని, వారికే ప్రాధాన్యత ఇస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు దివ్యవాణి. దీంతో ఆమెపై కొందరు వైసీపీ కోవర్ట్ అనే ముద్ర వేశారు. అందుకే దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే కొన్నిరోజులుగా సైలెంట్‌గా వున్న దివ్యవాణి ఏదో ఒక పార్టీలోకి చేరాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.
సినీ స్టార్స్‌ని దువ్వే పనిలో బీజేపీ :
మరోవైపు.. భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. సినీ నటుల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నితిన్‌తో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. త్వరలో మరికొందరు సినీ ప్రముఖులతో సమావేశమై వారిని పార్టీలోకి ఆహ్వానించాలని, లేదంటే మద్ధతు పొందాలని బీజేపీ భావిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com