YCP MLC:షాకింగ్ న్యూస్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హత వేటు

  • IndiaGlitz, [Thursday,May 16 2024]

ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పోలింగ్‌కు ముందు చాలా మంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది నేతలపై ఇప్పటికే అనర్హత వేటు వేయడంతో పాటు సస్పెండ్ కూడా అయ్యారు. అయితే పార్టీ మారిన వారిలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండానే జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. శాసనమండలిలో జంగా కృష్ణమూర్తి విప్‌గా ఉండటంతో ఆ పదవి నుంచి తొలగించింది. అంతేకాకుండా ఆయనపై శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద జంగాపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ విప్ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు.. కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. దీంతో కృష్ణమూర్తికి ఊహించని షాక్ తగిలింది. ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత అనర్హత వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.

కాగా జంగా కృష్ణమూర్తి ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 1999, 2009 ఎన్నికల్లో గురజాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన 2014లో వైఎస్సార్‌సీపీలో చేరి గురజాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టికెట్ ఆశించినా కాసు మహేష్ రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లోనైనా గురజాల నుంచి పోటీ చేయాలని భావించానా టికెట్ దక్కలేదు. అలాగే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో కూడా విభేదాలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన జంగా.. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఇదిలా ఉంటే ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అంతకుముందు పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, మక్కెన వెంకటేశ్వర్లు తదితరలు టీడీపీలో చేరారు. దీంతో పల్నాడులో వైసీపీకి ధీటుగా టీడీపీ ఎన్నికల్లో పోరాడింది. పోలింగ్ రోజుతో పాటు పోలింగ్ ముగిశాక కూడా పల్నాడులో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.