హాట్‌స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్‌చరణ్.. షాకింగ్ రెమ్యూనరేషన్..?
- IndiaGlitz, [Friday,September 17 2021]
మిస్ అయిన సీరియల్స్, మంచి వెబ్ షోలు, థియేటర్లకు వెళ్లకుండానే కొత్త సినిమాలు ఇవన్నీ చూసేందుకు అందుబాటులో వచ్చినవే ఓటీటీలు. లాక్డౌన్ పుణ్యామా అని వీటికి ఎక్కడా లేని డిమాండ్ వచ్చి పడింది. ప్రస్తుతం ఓటీటీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు దూసుకుపోతోంది. బడా నిర్మాణ సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టడం, ప్రేక్షకులు కూడా కోవిడ్ భయం.. టిక్కెట్ల ధరల కారణంగా ఓటీటీలకు మొగ్గుచూపుతుండడంతో వీటి మార్కెట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థల పోటీ కూడా అదే స్థాయిలో పెరిగింది. దీంతో ప్రమోషన్‌ను పెంచుకునే పనిలో పడ్డాయి ఆయా సంస్థలు. దీనిలో భాగంగానే అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తాజాగా భారీ ఎత్తుగడకు ప్లాన్ చేసింది. తెలుగు వెర్షన్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోనుంది.
రెండు వీడియో యాడ్స్‌తో పాటు ప్రింట్ ప్రకటనలు చేసేందుకు రామ్ చరణ్ ఒకే చెప్పారు. ఈ ఎండార్స్మెంట్ కోసం చెర్రీ ఏకంగా రూ. 3 కోట్లు తీసుకోనున్నారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. రామ్ చరణ్ ప్రస్తుతం ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో చెర్రీ క్రేజ్‌ను తమ సంస్థ ప్రమోషన్‌కు ఉపయోగించుకోవాలని భావించిన డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీ సంస్థ రామ్ చరణ్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనిపై రేపు అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ఆచార్య, ఆర్.ఆర్.ఆర్‌లతో పాటు తమిళ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్‌లోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే.