ఆర్జీవీ సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిశ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రాంగోపాల్‌వర్మ దిశ సినిమాపై ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దిశ ఘటనను ఆధారంగా చేసుకొని సినిమా తీయొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్‌పై స్పందించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్.. ఈ సినిమాపై సెన్సార్ బోర్డుకు పిటిషనర్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనను పరిష్కరించాలని కేంద్రం, సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దిశ ఘటన తమ కుటుంబాన్ని తీవ్ర దుఖంలో ముంచివేసిందని శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘటనను ఇంకా మరువలేకపోతున్నామన్నారు. ఇలాంటి సమయంలో రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నారన్నారు. నవంబర్ 26న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే వర్మ ప్రకటించారు. మరోవైపు సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కింద చాలా మంది అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. దీనిపై శ్రీధర్ రెడ్డి ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. ఓ వైపు కూతురు కోల్పోయిన బాధలో తాముంటే... మరోవైపు ఈ కామెంట్లు, ట్రైలర్ తమను తీవ్రంగా కలిచి వేస్తున్నాయన్నారు. వ్యక్తిగత జీవితాలను కించపరిచే విధంగా సినిమాలు తీయడం సరికాదన్నారు. దీనిపై హైకోర్టుతో పాటు జాతీయ మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్ వేశానన్నారు. తక్షణమే ట్రైలర్‌ను డిలీట్ చేయాలని.. సినిమాను నిలిపివేయాలని శ్రీధర్‌రెడ్డి కోరారు.
దిశ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు సూచనలు పాటిస్తామని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు ఏమైనా సీన్లు కట్ చేయమంటే చేస్తామన్నారు. కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామని నట్టికుమార్ వెల్లడించారు. దిశ తల్లిదండ్రుల్ని బాధపెట్టేలా ఈ సినిమా తీయలేదని.. సమాజంలో జరిగిన ఘటనను మాత్రమే చూపించబోతున్నామన్నారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేసినంత మాత్రాన.. మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదన్నారు. ఇంకా కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. దిశ తల్లిదండ్రులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని నిర్మాత నట్టికుమార్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments