వాట్సప్‌పై ఎందుకింత చర్చ? కొత్త ప్రైవసీ రూల్స్‌లో ఏముంది?
- IndiaGlitz, [Friday,January 08 2021]
దేశవ్యాప్తంగా వాట్సప్ ప్రైవసీ రూల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం ట్రెండింగ్‌లో ఉంది. అసలు వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్‌లో ఏముంది? ఎందుకంత చర్చ జరుగుతోంది? అందులో వాట్సప్ వినియోగదారులకు ఇబ్బందికర అంశాలేంటి? వంటి వాటిపై ఒక లుక్కేద్దాం..
ఇవాళ ఉదయం నుంచి వాట్సప్ ఓపెన్ చేయగానే కొత్త ప్రైవసీ రూల్స్ పాప్ అప్ మెసేజ్ ప్రతి వినియోగదారుడి ఫోన్లోనూ కనిపించే ఉంటుంది. అవి చదవకుండా యాక్సెప్ట్ చేసేవారు కొందరైతే.. చదివి తర్వాత చూద్దాములే అని లైట్ తీసుకునే వారు కొందరు. అయితే ఈ కొత్త ప్రైవసీ రూల్స్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మరాయి. ఆ రూల్స్‌ను యాక్సెప్ట్ చేస్తే మాత్రం మన ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. ఆ విషయాలు తెలుసుకోకుండా యాక్సెప్ట్ చేస్తే మాత్రం చిక్కుల్లో పడ్డట్టే. ఆ కొత్త ప్రైవసీ రూల్స్‌లో మన డేటాను వాట్సప్ ఎలా ఉపయోగించుకోబోతుందో.. మన డేటాను ఫేస్‌బుక్‌కు ఎలా షేర్ చేసుకుంటుందో.. దీంతో పాటు మన వివరాలను వ్యాపారులకు ఎలా షేర్ చేస్తారో అన్నీ ఆ కొత్త రూల్స్‌లో సవివరంగా ఉన్నాయి.
ఇప్పటి వరకూ వాట్సప్ అంటే ప్రైవసీకి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్న పేరుంది. అందుకే ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగించేవారి సంఖ్య పెరిగింది. వాట్సప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండటం మరో కారణం. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే మనం పంపిన మెసేజ్ ఎవరికైతే పంపామో.. వారికి మాత్రమే కనిపిస్తుంది. ఎవరూ హ్యాక్ చేసి ఆ మెసేజ్‌ని చదవడం సాధ్యం కాదు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నందుకే వాట్సప్ యూజర్ల సంఖ్య పెరిగింది. కానీ ఇప్పుడు వాట్సప్ ప్రైవసీ పాలసీలో కొత్త మార్పులు వచ్చాయి. మనం వాట్సప్ కొత్త రూల్స్ యాక్సెప్ట్ చేసినట్టైతే మనం ఉపయోగించే ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌కి తెలుస్తాయి.
అంతేకాకుండా.. మనం పంపే మెసేజెస్ పైనా వాట్సప్ నిఘా ఉంటుంది. మన అభిరుచులు, ఆసక్తులు.. ఎక్కువగా వేటి గురించి మాట్లాడతాం అన్న విషయాలు వాట్సప్‌కు తెలుస్తాయి. ఇలా తెలుసుకున్న సమాచారాన్ని వాట్సాప్.. ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది. ఒకప్పుడు వాట్సప్ ఇండిపెండెంట్ సంస్థ. కానీ ఇప్పుడు ఫేస్‌బుక్‌కు చెందిన సంస్థ. అభిరుచులు, ఆసక్తులు ఫేస్‌బుక్‌కి తెలియడం వల్ల మనం ఏవి ఇష్టపడతారో అందుకు సంబంధించిన యాడ్స్ మీ స్క్రీన్‌పైన ఎక్కువగా కనిపిస్తాయి. దీని ద్వారా మీకు ఆ అడ్వర్టైజ్మెంట్ల ట్రాప్‌లో పడే అవకాశం ఉంది. ఇటీవల వాట్సప్ పేమెంట్స్ మొదలైన సంగతి తెలిసిందే. అందులో మనం చేసే లావాదేవీల వివరాలను కూడా ఫేస్‌బుక్‌తో వాట్సాప్ పంచుకోనుంది. మన ఫోన్ నెంబర్లను సైతం ఫేస్‌బుక్‌తో పంచుకుంటుంది. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రానుంది. అంటే అంతలోపు వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించాలి. ఈ రూల్స్ అంగీకరించకపోతే మీరు వాట్సప్ యాప్ ఉపయోగించడం సాధ్యం కాదు. అయితే ఇదంతా ఎందుకొచ్చిన గొడవలే అని చాలా మంది వాట్సప్‌ను తమ ఫోన్ల నుంచి తొలగిస్తున్నారు.