అసలు చర్చ వీడి.. ఈగ గురించి రచ్చ స్టార్ట్..
- IndiaGlitz, [Thursday,October 08 2020]
అది అమెరికాలోని ఊటా రాష్ట్రం.. ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య వాడివేడి చర్చ.. చిన్న చీమ కూడా దూరేందుకు వీలు లేని ఫ్లెక్సీ గ్లాస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో.. ఒక ఈగ వచ్చింది. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ మాట్లాడుతుంటే ఆయన తలపై వచ్చి వాలింది. రెండు నిమిషాల పాటు అది ఆయన తలపైనే ఉండిపోయింది. చర్చానంతరం సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయింది. చర్చలో ఎవరు గెలిచారన్న దానిపై కాదు.. మైక్ పెన్స్ తలపై వాలిన ఈగ గురించి.. సెకన్లలో ఈ విషయం సోషల్ మీడియాలో మంచి హిలేరియస్ చర్చా కార్యక్రమానికి వేదికగా మారిపోయింది.
అసలు విషయం ఏంటంటే.. అమెరికాలోని ఊటా రాష్ట్రంలో ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. చర్చా వేదిక పకడ్బందీ రూంలో కనీసం చీమ కూడా వెలుపలకు వచ్చేందుకు అవకాశం లేని ప్లెక్సిగ్లాస్ రూంలో జరుగుతోంది. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ జాత్యహంకారం, పోలీసు సంస్కరణల గురించి మాట్లాడే సమయంలో ఫ్లెక్సీ గ్లాసులను దాటుకుని మరీ ఓ ఈగ వచ్చి మైక్ పెన్స్ తలపై వాలింది. అంతే చర్చ నుంచి అందరి కళ్లు ఈగ వైపు తిరిగాయి. అది ఎన్ని నిమిషాల పాటు ఆయన తలపై ఉందో కూడా గణించారు. ఇక చర్చ సోషల్ మీడియాకు షిఫ్ట్ అయిపోయింది. సహజంగా అయితే ఇరు పార్టీలకు చెందిన నేతల గురించి నెటిజన్లు మాట్లాడుకోవాలి. కానీ నెటిజన్లు అభ్యర్థుల సంగతి పక్కనపెట్టేసి మైక్ పెన్స్ తలపై వాలిన ఈగ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
‘ముఖాముఖి చర్చలో గెలిచింది మైక్ పెన్స్ కాదు.. కమలా హ్యారిస్ కాదు.. ఓ ఈగ ఈ చర్చలో గెలిచింది’ అంటూ నెటిజన్లు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ‘ఓకే.. ఈ డిబేట్ ముఖ్యమైనదే. కానీ ప్రతి ఒక్కరు ఈగ గురించి తప్ప మరే అంశాన్ని గుర్తుపెట్టుకోరు’ అంటూ ఒకరు.. ‘ఆ ఈగ మైక్ పెన్స్ తలలో చాలా సేపు ఉంది. ఈగ వెంటనే క్వారంటైన్‌కు వెళ్లాలి’ అంటూ మరొకరు.. ‘ఈగ కూడా 2 నిమిషాల నియమాన్ని పాటిస్తోంది. మైక్ పెన్స్ తలపై రెండు నిమిషాల పాటు ఉంది’ అని ఇంకొకరు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఓ నెటిజన్ ఏకంగా ‘మైక్‌పెన్స్‌ఫ్లై’ అంటూ ట్విట్టర్ ఖాతానే తెరిచేశాడు. ఈ ఖాతా తెరిచిన నిమిషాల్లోనే 60 వేల మందికి పైగా ఫాలోవర్లు వచ్చేశారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్ సైతం ఈగపై స్పందించడం విశేషం.