Dirty Hari Review
డిజిటల్ మాధ్యమాలు సినిమాలను థియేటర్స్‌తో సంబంధం లేకుండా విడుదల చేసుకోవడానికే కాదు.. కొత్త కాన్సెప్ట్‌ను ధైర్యంగా సినిమాల రూపంలో తెరకెక్కిండానికి కూడా తెలియని ఓ ధైర్యాన్ని ఇచ్చేస్తున్నాయి. ఓటీటీల్లో విడుదలయ్యే వెబ్ సిరీస్‌ల్లో అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండటంతో.. ఇప్పుడు రిలేషన్స్‌లో భిన్న కోణాలను ఓటీటీ మాధ్యమాల్లో సినిమాలుగానో, వెబ్ సిరీస్‌లుగానో మనం చూడొచ్చు. అలాంటి కంటెంట్‌తో రూపొందిన సినిమా డర్టీ హరి. సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకుడిగా మారి కొన్ని సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నిర్మాతగా సక్సెస్ అయిన ఎం.ఎస్.రాజు ఎందుకనో దర్శకుడిగా మాత్రం హిట్‌ను అందుకోలేపోయాడు. మరి డర్టీ హరితో అయిన ఎం.ఎస్.రాజు సక్సెస్‌ను అందుకున్నారా లేదా? అనే విషయం తెలియాలంటే సినిమాకథలోకి వెళదాం..
కథ:
హరి(శ్రవణ్ రెడ్డి) టౌన్ నుండి సిటీకి ఉద్యోగం సంపాదించుకుని ఎదగాలనే కోరికతో వస్తాడు. చెస్‌లో స్టేట్ ప్లేయర్ కావడంతో ఓ పెద్ద క్లబ్‌లో ఉద్యోగం సంపాదించుకుంటాడు. అక్కడకు రెగ్యులర్‌గా వచ్చే ఆకాశ్‌తో చెస్ ఆడి గెలుస్తాడు. క్రమంగా ఆకాశ్‌తో పరిచయం కాస్త ఫ్రెండ్‌షిప్‌గా మారుతుంది. తర్వాత ఆకాశ్ వాళ్ల కటుంబ సభ్యులు పరిచయం అవుతారు. ఆకాశ్ చిన్నాన్న దగ్గరే పెరుగుతాడు. ఆకాశ్ చిన్నాన్న కూతురు వసుధ(రుహానీ శర్మ)తో హరి స్నేహం పెరిగి ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత అది పెళ్లిగా మారుతుంది. అదే సమయంలో ఆకాశ్ గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్(సిమ్రత్ కౌర్) కూడా పరిచయం అవుతుంది. జాస్మిన్ మోడల్, సినిమాల్లో రాణించాలని తన ప్రయత్నాలు తను చేస్తుంటుంది. అయితే ఆకాశ్ పిన్నమ్మకు జాస్మిన్ అంటే నచ్చదు. దాంతో జాస్మిన్‌ను ఆకాశ్ వదిలేస్తాడు. అప్పుడు జాస్మిన్‌తో హరి రిలేషన్ షిఫ్ ఏర్పరుచుకుంటాడు. ఇద్దరూ శారీరకంగానూ దగ్గరవుతారు. జాస్మిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. వసుధను వదిలేయమని, లేకుంటే తనే వసుధకు నిజం చెబుతానని హరితో జాస్మిన్ అంటుంది. ఒకానొక సందర్భంలోజాస్మిన్‌ను చంపడానికి హరి నిర్ణయం తీసుకుంటాడు. అయితే జాస్మిన్, ఆమె స్నేహితురాలు శవాలుగా మారి ఉంటారు. అసలు వారిని చంపిందెవరు? హరికి వారి హత్యలో భాగమెంత? వసుధకు నిజం తెలుస్తుందా? లేదా? అనే నిజం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
నిర్మాతగా ఎం.ఎస్.రాజు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. ఆయన సినిమాలంటే ఓ ట్రేడ్ మార్క్ ఉంటుంది. అయితే ఆయన దర్శకుడిగా మారి డైరెక్ట్ చేసిన సినిమాలేవీ ఆయనకు కలిసి రాలేదు. అయితే కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండే సినిమాలు తీసే ఎం.ఎస్.రాజు ఈసారి పరిధిని దాటి కాస్త అడల్ట్ కంటెంట్‌తో చేసిన సినిమా ఈ డర్టీ హరి. పోస్టర్, ట్రైలర్ ద్వారా ఈ విషయాన్ని నిర్మాత ముందుగానే చెప్పారు. ఇక సినిమా విషయానికి వస్తే హీరో సిటీ రావడం.. అక్కడ ఓ అమ్మాయిని ప్రేమించడం మరో అమ్మాయి తగులుకోవడం.. శారీరక సంబంధం పెట్టుకోవడం... తర్వాత కథ అనుకోని మలుపు తీసుకోవడం అనే అంశాలను ప్రేక్షకుడు ఊహించేదే. పదిహేనేళ్ల క్రితం ఇమ్రాన్ హస్మీ సినిమాలు ఇలాంటి స్క్రీన్‌ప్లేతో రన్ అయ్యేవి అలాంటి కాన్సెప్ట్‌తో ఎం.ఎస్.రాజు సినిమాను తెరకెక్కించారు. నెక్డ్ సీన్స్ లేవు కానీ.. లిప్‌లాక్‌లను బాగానే చూపెట్టారు. ఇప్పటి వరకు చేసిన చిలసౌ, హిట్ చిత్రాల కథానాయిక రుహానీ శర్మ .. ఈ సినిమాలో లిప్‌లాక్‌లు బాగానే పెట్టింది. సరే కథ డిమాండ్ చేసిందనే అనుకోవాలి మరి. ఎక్కడో ఉండే కుర్రాడు..సుఖమయమైన జీవితానికి అలవాటు పడ్డ తర్వాత మనసు పరుగులు పెట్టిన చోటకి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతుందనేదే సినిమా కాన్సెప్ట్. సినిమా ఫస్టాఫ్ సాదాసీదాగా సాగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్ వచ్చే వరకు అంతే. చివరి పది నిమిషాలను కాస్త ఆసక్తికరంగానే మలిచారు. పాటలు ఓకే.. మార్క్ కె.రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. సినిమాటోగ్రఫీ బావుంది. నటీనటులు వారి వారి పాత్రల పరిధి మేరకు చక్కగానే నటించారు.హీరో శ్రవణ్ రెడ్డి లుక్స్ పరంగా బాగానే ఆకట్టుకుంటాడు.
చివరగా.. డర్టీ హరి.. ఓ లస్ట్ స్టోరీ
- Read in English