తాప్సీ చిత్రం నుంచి దర్శకుడు అవుట్.. కారణం ఇదే!
- IndiaGlitz, [Wednesday,June 23 2021]
ప్రస్తుతం వెండితెరపై క్రికెటర్ల బయోపిక్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ జీవితాలపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ధోని బయోపిక్ చిత్రం ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ, సచిన్ బయోపిక్ 'సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్' చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులని అలరించాయి.
కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 83 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఇండియన్ మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత చరిత్రపై కూడా బయోపిక్ చిత్రం తెరకెక్కుతోంది. 'శభాష్ మిథు' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరక్కుతున్న సంగతి తెలిసిందే.
క్రేజీ హీరోయిన్ తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోంది. ముందుగా ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ ధోలాకియా ఐ ప్రకటించారు. తాజాగా తాను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు రాహుల్ ప్రకటించడం చర్చనీయాంశం అయింది. కరోనా ప్రభావం వల్లే తాను ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది అని రాహుల్ అన్నారు.
కరోనా ప్రతి ఒక్కరి షెడ్యూల్స్ ని తారుమారు చేసింది. అందుకు నేనేమీ భిన్నం కాదు. కరోనా వల్ల నా ప్లాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అని రాహుల్ ధోలాకియా అన్నారు. తనకున్న షెడ్యూల్స్ కారణంగా 'శభాష్ మిథు' డైరెక్ట్ చేయడం కుదరదని, అందువల్లే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
దీనితో రాహుల్ స్థానంలోకి శ్రీజిత్ ముఖర్జీ వచ్చారు. 'శభాష్ మిథు' చిత్రానికి శ్రీజిత్ దర్శకత్వ భాద్యతలు స్వీకరించనున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం తాప్సి క్రికెట్ లో శిక్షణ కూడా పొందింది.