‘‘యమగోల’’ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత, రీమేక్‌ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ మరణాన్ని మరిచిపోకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమగోల’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తాతినేని కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. రామారావు మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు రామారావు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తాతినేనికి భార్య జయశ్రీ, ఇద్దరు కుమార్తెలు చాముండేశ్వరి, నాగసుశీల, కుమారుడు అజయ్ వున్నారు.
కృష్ణాజిల్లా, కపిలేశ్వరపురంలో 1938లో తాతినేని రామారావు జన్మించారు. అప్పటి ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశ్‌రావుకు రామారావు దగ్గరి బంధువు. ఆయన అడుగు జాడల్లోనే రామారావు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రకాశ్‌రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం నాగేశ్వరరావు, సావిత్రి కాంబినేషన్‌లో ‘నవరాత్రి’ చిత్రాన్ని తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టారు. అనంతరం. ‘బ్రహ్మచారి’, ‘మంచి మిత్రులు’, ‘జీవన తరంగాలు’, ‘దొరబాబు’, ‘యమగోల’, ‘అనురాగ దేవత’, ‘పచ్చని కాపురం’ వంటి చిత్రాలకు రామారావు దర్శకత్వం వహించారు.
వీటన్నింటిలోకి ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’ చిత్రం ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపింది. అదే చిత్రాన్ని 1979లో హిందీలోకి ‘లోక్ పర్‌లోక్’ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్‌లోనూ విజయం సాధించారు. అనంతరం జీవన్‌ధార, జుదాయి, అంధకానూన్, ఏ దేశ్, దోస్తీ, దుష్మనీ, రావణ్‌రాజ్, బులాండీ, భేటీ నెం.1 హిందీ చిత్రాలకు తాతినేని దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గా బిజీగా వుంటూనే పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు రామారావు నిర్మాతగా వ్యవహరించారు.
ముఖ్యంగా రామారావు రీమేక్‌ల స్పెషలిస్ట్‌గా ఆ కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువ తమిళ సినిమాలను రీమేక్ చేసి హిట్ కొట్టేవారు . జానపదాలు, పురాణాలు, చారిత్రక సినిమాలు వెండి తెరను ఏలుతున్న సమయంలో సాంఘీకాలను తెరకెక్కించి ట్రెండ్ సెట్ చేశారు. సుధీర్ఘ కెరీర్‌లో 70 సినిమాలకు దర్శకత్వం వహించారు తాతినేని.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout