ఈ సినిమా చేయ‌డం రిస్క్ అందుకే వాళ్లు ముందుకు రాలేదేమో - డైరెక్ట‌ర్ అవ‌స‌రాల శ్రీనివాస్

  • IndiaGlitz, [Tuesday,September 06 2016]

అష్టా చ‌మ్మా సినిమాతో న‌టుడుగా ప‌రిచ‌య‌మై....ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన ఏక్ట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ అవ‌స‌రాల శ్రీనివాస్. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా కాంబినేష‌న్లో అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కించిన చిత్రం జ్యోఅచ్యుతానంద‌. వారాహి చ‌ల‌నచిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించిన జ్యోఅచ్యుతానంద‌ చిత్రం ఈనెల 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా జ్యోఅచ్యుతానంద‌ చిత్రం గురించి డైరెక్ట‌ర్ అవ‌స‌రాల శ్రీనివాస్ ఇంట‌ర్ వ్యూ మీకోసం...

జ్యోఅచ్యుతానంద‌ క‌థ ఏమిటి..?

ఇది అన్న‌ద‌మ్ముల క‌థ‌. రోహిత్ అన్న‌గా న‌టిస్తే, నాగ శౌర్య త‌మ్ముడుగా న‌టించాడు. వీళ్ల ఇంట్లో రెజీనా రెంట్ కి దిగుతుంది. ఇదేదో ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరి అనుకుంటే పొర‌పాటే. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టుగా అన్న‌ద‌మ్ముల అనుబంధం గురించి చెప్పే వైవిధ్య‌మైన క‌థ ఇది. కామెడీ ఉంటుంది. అలాగ‌ని ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాలా ఉండ‌దు కొత్త‌గా ఉంటుంది.

ఈ క‌థ ఎలా పుట్టింది..?

ఊహ‌లు గుస‌గులాడే సినిమా అనేది సింపుల్ స్టోరి. ఈసారి అలా కాకుండా కొత్త‌గా ఇంట్ర‌స్టింగ్ గా ఉండాలి అని ఆలోచిస్తున్న‌ప్పుడు ఓ ఆలోచ‌న వచ్చింది. ఐడియా వ‌చ్చిన త‌ర్వాత నేను అనుకున్న విధంగా రావ‌డానికి ఓ నాలుగు నెల‌లు ప‌ట్టింది.

నారా రోహిత్, నాగ శౌర్య ను ఎంపిక చేయ‌డం ఎలా జ‌రిగింది..?

ఈ క‌థ‌ను కొంత మంది హీరోల‌కు చెప్పిన‌ప్పుడు బాగుంది చేద్దాం అన్నారు. ఆత‌ర్వాత ఇద్ద‌రు హీరోలు ఉన్న క‌థ కాకుండా సోలోగా ఉండే క‌థ అయితే చేద్దాం అన్నారు. ఓరోజు రోహిత్ కి క‌థ చెప్పాను. రోహిత్ కూడా సోలో హీరో క‌థ అయితేనే చేస్తాను అంటాడు అనుకున్నాను. కానీ...క‌థ విన్న త‌ర్వాత ఈ సినిమా నేను చేస్తాను అని చెప్పాడు. ఆత‌ర్వాత నాగ‌శౌర్య‌కి చెప్ప‌డం...ఓకే అన‌డం జ‌రిగింది.

మ‌న హీరోలు మ‌ల్టీస్టారర్ మూవీస్ కి రెడీ అంటున్నారు క‌దా..మ‌రి ఈ సినిమా చేయ‌డానికి ఎందుకు ముందుకు రాలేదు..?

ఈమ‌ధ్య కాలంలో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ఊపిరి...ఇలా మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ వ‌చ్చాయి. స్టార్ హీరోలు మ‌ల్టీస్టార‌ర్ చేస్తే...ఆ సినిమా రిజ‌ల్ట్ తేడా వ‌చ్చినా వాళ్ల కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అయితే...ఈ సినిమాకి అప్ క‌మింగ్ హీరోలే కావాలి. అప్ క‌మింగ్ హీరోలు ఇలాంటి సినిమా చేయ‌డం అనేది కాస్త రిస్క్. అందుచేత వాళ్లు ముందుకు రాలేదేమో అనిపించింది.

హీరోయిన్ క్యారెక్ట‌ర్ కి ముందు నుంచి రెజీనాని అనుకున్నారా..? లేక వేరే ఎవ‌ర‌నైనా అనుకున్నారా..?

జ్యోత్స్న అనే హీరోయిన్ క్యారెక్ట‌ర్ ని ముందు కొత్త అమ్మాయితో చేయాలి అనుకున్నాం. చాలా మందిని చూసాం. హైద‌రాబాద్, చెన్నై, ముంబాయి...ఇలా చాలా మంది కొత్త అమ్మాయిల‌ను చూసాం కానీ... క్యారెక్ట‌ర్ కి త‌గ్గ‌ట్టు కాన్ఫిడెంట్ గా ఎవ‌రూ క‌నిపించ‌లేదు. అప్పుడు మా క్యారెక్ట‌ర్ కి రెజీనా అయితే బాగుంటుంది అనిపించి సెలెక్ట్ చేసాం.

ఇంత‌కీ ఈ సినిమాలో ఉన్న కొత్త‌ద‌నం ఏమిటి..?

ఈమ‌ధ్య కాలంలో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు త‌ప్ప అన్న‌ద‌మ్ముల అనుబంధం మీద సినిమా వ‌చ్చి చాలా రోజులు అయ్యింది. అన్న‌ద‌మ్ములు కొట్టుకోవ‌డాలు, తిట్టుకోవ‌డాలు...అలాగే వాళ్ల మ‌ధ్యే ఉండే ఎమోష‌న్ అన్నీ చూపిస్తున్నాను. ఇంకో విష‌యం ఏమిటంటే...ఈ సినిమాలో హీరోలిద్ద‌రికీ పెళ్లి అయిపోతుంది. అది సినిమా ప్రారంభంలోనే చూపిస్తాం. ఫ‌స్టాఫ్ 2010 లో ఉంటే...సెకండాఫ్ 2016లో ఉంటుంది ఇలా...కొత్త‌గా ఇంట్ర‌స్టింగ్ గా ఉండే అంశాలు చాలా ఉన్నాయి.

జ్యోఅచ్యుతానంద సాంగ్స్ కి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. మీ ఫీడ్ బ్యాక్ ఏమిటి..?

క‌ళ్యాణి మాలిక్ నాకు ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంలో ఏం సందేహం లేదు అనే సాంగ్ ఇచ్చారు. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఒక లాల‌న అనే పాట గురించి అంద‌రూ మాట్లాడుతున్నారు. భాస్క‌ర‌భ‌ట్ల అన్ని పాట‌ల‌కు మంచి సాహిత్యాన్ని అందించారు. ఆడియోకు చాలా మంచి ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. మా సినిమాకి ఆడియో మ‌రింత ప్ల‌స్ అవుతుంది.

ఇందులో నాని స్పెషల్ రోల్ చేసార‌ట క‌దా...మ‌రి మీరు కూడా న‌టించారా..?

అవును...నాని స్పెష‌ల్ రోల్ చేసాడు. నేను ఓ చిన్న సీన్ లో న‌టించాను. కాక‌పోతే ఆ సీన్ ఎడిటింగ్లో పోయింది.

ఈ సినిమా ట్రైల‌ర్స్ చూస్తుంటే.... మ‌ల్టీప్లెక్స్ ఆడియోన్స్ కోసం అనిపిస్తుంది మీరేమంటారు..?

మ‌ల్టీప్లెక్స్ ఆడియోన్స్ కోస‌మా, వేరే ఆడియోన్స్ కోస‌మా అనేది నాకు తెలియ‌దు. నాకు తెలిసింది ఒక్క‌టే... ఎక్క‌డైనా ఎమోష‌న్ ఒక్క‌టే. ఏదైనా ఇంట్ర‌స్టింగ్ గా చెబితే చూస్తారు అని నా ఫీలింగ్..!

ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమా త‌ర్వాత మీకు గ్యాప్ రావ‌డానికి కార‌ణం ఏమిటి..?

కంచె, నాన్న‌కు ప్రేమ‌తో...అఆ...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించాను. కంచె సినిమా షూటింగ్ లో చేయికి దెబ్బ త‌గల‌డం వ‌ల‌న స‌ర్జ‌రీ చేయాల్సి వ‌చ్చింది. అలాగే..నా క‌థ‌ల‌ను నేనే రాసుకుంటాను. ఐడియా వ‌చ్చిన త‌ర్వాత ఫుల్ స్ర్కిప్ట్ రాయడానికి ఓ నాలుగు నెల‌ల టైమ్ ప‌డుతుంది. అందుచేత కాస్త ఎక్కువ గ్యాప్ వ‌చ్చింది.

మీ రెండు సినిమాలు వారాహి బ్యాన‌ర్ లోనే చేసారు. బ‌య‌ట బ్యాన‌ర్స్ లో చేయ‌రా..?

రెండు సినిమాలు వారాహి బ్యాన‌ర్ లో చేయాలి అని అగ్రిమెంట్. కాక‌పోతే మ‌రో సినిమాకి మా అగ్రిమెంట్ ని పొడిగించాం. ఆత‌ర్వాత బ‌య‌ట బ్యాన‌ర్స్ లో చేస్తాను.

హంట‌ర్ అనే సినిమాలో న‌టిస్తున్నారు క‌దా..! అడ‌ల్ట్ కామెడీతో ఉండే ఈ సినిమాలో న‌టించ‌డానికి రీజ‌న్ ఏమిటి..?

అడ‌ల్ట్ కామెడీ అయినా...ఇందులో ఎమోష‌న్ ఉంది. ఆ ఎమోష‌న్ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?

నానితో ఓ సినిమా చేయాలి. వారాహి బ్యాన‌ర్ లో ఓ సినిమా చేయాలి. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఏ సినిమా స్టార్ట్ చేస్తాను అనేది తెలియ‌చేస్తాను.