నాపై, కథపై దిల్ రాజుగారు పెట్టుకున్న నమ్మకమే 'శతమానం భవతి' సక్సెస్ కు కారణం - దర్శకుడు సతీష్ వేగేశ్న
- IndiaGlitz, [Wednesday,February 08 2017]
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం 'శతమానం భవతి'. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ వేగేశ్న సినిమా సక్సెస్ గురించి సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు...
సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
చాలా హ్యాపీగా ఉన్నాను. శతమానం భవతి' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. అయితే శతమానం భవతి సినిమాకు ముందు, తర్వాత సతీష్ వేగేశ్న ఒకేలానే ఉన్నాడు. కాకుంటే శతమానం భవతి సక్సెస్‌తో మంచి పేరు వచ్చింది.
'శతమానం భవతి' ముందు సతీష్, తర్వాత సతీష్ ఎలా మారాడు?
'శతమానం భవతి' సినిమాకు ముందు నేను కథలు చెబుతానని ఫైల్ పట్టుకుని తిరిగేవాడిని. ఈ సక్సెస్‌తో కథలు చెప్పమని అడుగుతున్నారు. అంతే తప్ప సతీష్ మారడు. ఏ స్క్రిప్ట్ అయినా నమ్మే చేస్తాం. కొన్నిసార్లు ఆడియెన్స్‌కు మనం చెప్పే కథ కనెక్ట్ అవుతుంది. కొన్నిసార్టు కనెక్ట్ కాదు. ఇక ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. కామన్‌గా ఆడియెన్స్ అందరూ కనెక్ట్ అయ్యే సబ్టెక్ట్ కాబట్టి సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. డెఫనెట్‌గా సినిమా సక్సెస్ అవుతుందని ఊహించాం కానీ ఇంత పెద్ద హ్యుజ్ సక్సెస్ అవుతుందని అనుకోలేదు.
ఈ సినిమాకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏదీ?
ఈ కథను ముందుగా రాఘవేంద్రరావుగారికి వినిపించాను. ఆయన విని ఎన్ని రోజులుగా ఈ కథపై వర్క్ చేస్తున్నావు అన్నారు. అప్పటికి వన్ ఇయర్ అయ్యుండటంతో వన్ ఇయర్ సార్ అన్నాను. ఈ వర్క్ కనపడుతుంది. సాధారణంగా హీరో హీరోయిన్లపైనే దర్శకులు కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ ఈ కథలో ప్రతి క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉందని మెచ్చుకున్నారు. సినిమా రిలీజైన తర్వాత దాసరి నారాయణరావుగారు బోకేను పంపారు. తర్వాత ఆయన ఫోన్ చేసి సినిమా ప్రశాంతంగా ఉంది. సినిమాను కచ్చితంగా నేషనల్ అవార్డ్‌కు పంపండి అని అన్నారు. రీసెంట్గా డైరెక్టర్స్ అసోసియేషన్‌కు షో వేసినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత కె.విశ్వనాథ్‌గారు వచ్చి సినిమా చూసి..సినిమా చాలా బావుంది. సినిమా చూసిన తర్వాత మేం కూడా నేర్చుకోవాలనిపించేలా ఉందని అన్నారు. అంటే తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిన దర్శకులైన ఈ ముగ్గురు నా సినిమాను అప్రిసియేట్ చేయడం చాలా గొప్ప విషయం.
ఈ కథకు ముందు వేరు హీరోలను అనుకన్నారు కదా..తర్వాత శర్వానంద్‌తో చేయడానికి కారణమేంటి?
సంక్రాంతి కాన్సెప్ట్ మూవీ కాబట్టి సంక్రాంతికే సినిమా రిలీజ్ చేయాలని గోల్‌గా పెట్టుకున్నాం. కాబట్టి ముందు 'శతమానం భవతి' కథ విన్న సాయిధరమ్ తేజ్ కానీ, రాజ్‌తరుణ్ కానీ కథ నచ్చింది..సినిమా చేద్దామనే అన్నారు. అయితే కానీ డేట్స్ అడ్జస్ట్ చేయడానికి వారికి కుదరలేదు. కాబట్టి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నాం. ఒకపక్క హీరోల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో, ఎవరైతే బావుంటుందని ఆలోచించాం. శర్వానంద్ అయితే సరిపోతాడనిపించి శర్వాను కలవడం, అతనికి కథ నచ్చడంతో సినిమాను స్టార్ట్ చేశాం.
దిల్‌రాజుగారికే ఈ కథను ఎందుకు చెప్పాలనుకున్నారు?
ఈ కథను దిల్‌రాజుగారికే చెప్పడానికి రెండు కారణాలున్నాయి. నేను దర్శకుడుగా సక్సెస్‌లో లేను. అలాంటప్పడు నన్ను నమ్మి సినిమా చేసే నిర్మాత కానీ, లేదా కథను నమ్మి సినిమా చేసే నిర్మాత కానీ ఉండాలి. కథ నచ్చితే దర్శకుడుకి ఇంతకుముందు సక్సెస్ ఉందా లేదా అని ఆలోచించకుండా సినిమా చేసే ప్రొడ్యూసర్ దిల్‌రాజుగారు. రాజుగారికి కమర్షియల్ సినిమాలంకటే బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి సినిమాల ద్వారా వచ్చిన పేరే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మంచి కథను చెబితే రాజుగారు నమ్మి చేస్తారని నమ్మడంతోనే ఆయనకు ఈ కథను చెప్పాను. ఆయనకు నచ్చింది.
ఇంత పెద్ద రెస్పాన్స్ రావడానికి ప్రత్యేకంగా కారణమేదైనా ఉందా?
ఇంతకు ముందు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రాలు వచ్చాయి. అయితే ఆడియెన్స్ కనెక్ట్ అయిన సన్నివేశాలు తక్కువగా ఉన్నాయి. కానీ శతమానం భవతి చిత్రంలో ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎమోషనల్ పాయింట్‌ను ఎవరూ టచ్ చేయలేదు. కథ కొత్తది కాకపోవచ్చు కానీ, వెళ్ళిన స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. అందుకే ఆడియెన్స్ పర్సనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు.
ఈ సినిమా మేకింగ్ టైంలో దిల్‌రాజుగారి ప్రభావం ఎంత?
దిల్‌రాజుగారి బ్యానర్లో వచ్చే ఏ సినిమా అయినా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ సినిమాకు ఇంత మంచి ఆదరణ లభింస్తుందంటే కారణం ముందు ఇది దిల్‌రాజు బ్యానర్లో వస్తున్న సినిమా అని ఆడియెన్స్ అనుకోవడమే. ఆయన దగ్గరుండి ప్రతి వ్యవహారాన్ని దగ్గరుండి చూసుకుని అవుట్‌పుట్ బాగా వచ్చేలా చూసుకుంటారు.
అసలు 'శతమానం భవతి' కథాలోచన ఎలా వచ్చింది?
నేను ఈనాడు జర్నలిస్ట్‌గా వర్క్ చేశాను. నేను పనిచేస్తున్నప్పుడు పత్రికలకు దసరా,దీపావళి, సంక్రాంతి పండుగలప్పుడే సెలవులుండేవి. సెలవు వస్తుందనగానే రేపు సెలవు కదా..అనే ఫీలింగ్ ఉండేది. నిద్ర లేవగానే ఈరోజు పండుగ వాతావరణం లేదేంటి అనే బాధ ఉండేది. దీని బేస్ చేసుకుని పల్లె పయనమెటు? అనే షార్ట్ స్టోరీ రాశాను. ఆ కథను ఆంధ్రప్రభ ఉగాదికథల పోటీకి కూడా పంపాను. కానీ వారు ముద్రించలేదు. నేను రాసిన కథలో ఓ అమ్మాయి సంక్రాంతి పండుగ కోసం తన తాతగారి ఊరుకి వస్తుంది కానీ, తను ఊహించిన విధంగా ఊర్లో పండుగ వాతావరణం కనపడదు. అదే విషయాన్ని తాత దగ్గర అడుగుతుంది. తాతయ్యేమో..ఈ ప్రశ్నకు జనమే సమాధానం చెప్పాలి. పల్లెటూర్లు ఎదగాలి కానీ మూలాలు మరచి ఎదగడం ఎంత వరకు కరెక్టో తెలియడం లేదంటూ చెబుతాడు. ఈ కథను కబడీ కబడీ టైంలో జగపతిబాబుగారికి చెప్పాను. ఆయన ఈ కథను షార్ట్ ఫిలిం చేద్దాం నేను ప్రొడ్యూస్ చేస్తానని అన్నారు. సరేనని అన్నాను కానీ, మళ్లీ వర్క్‌లో పడిపోయాను. కొన్ని రోజుల తర్వాత ఇదే కథను కొంత మంది స్నేహితులకు చెబితే ఈ కథను సినిమా కథగా డెవలప్ చేయమని వారు అన్నారు. అప్పుడు నేను నా పాయింట్‌ను సినిమా కథగా డెవలప్ చేసి పక్కన పెట్టుకున్నాను. రామయ్యా వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలకు దిల్‌రాజుగారి బ్యానర్లో పనిచేశాను. ఆయనైతే ఈ కథను చేస్తారని నమ్మి ఈ కథను ఆయనకు చెప్పాను. ఆయనకు నచ్చడంతో సినిమా ప్రయాణం మొదలైంది. పక్కా స్క్రిప్ట్‌ను తయారు చేసుకోవడంతో సినిమాను 49 రోజుల్లోనే పూర్తి చేయగలిగాం. 'శతమానం భవతి' సక్సెస్ దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగింది.
నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుంది?
ఇంకా ఏ సినిమా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. దిల్‌రాజుగారితో ఓ సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి కథను సిద్ధం చేసుకున్న తర్వాత ఎవరితో చేస్తే బావుంటుందో వారికి కథ వినిపించి సినిమా చేస్తాను. నా నెక్ట్స్ మూవీ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్ మీదనే ఉంటుంది.