ఇండస్ట్రీలో ఎవరైనా నచ్చకుంటే వారి మానాన వారిని వదిలెయ్యండి: డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి
- IndiaGlitz, [Monday,June 22 2020]
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇండస్ట్రీలో కొందరి ప్రవర్తనను ప్రశ్నించింది. ఇండస్ట్రీలో అందలమెక్కించే భుజాలే కాదు.. తొక్కేసే కాళ్లు కూడా ఉంటాయని వెల్లడించింది. దీనిపై డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి పరోక్షంగా స్పందించారు. తను పెట్టిన పోస్ట్ డిప్రెషన్‌లోకి వెళ్లిన వారి గురించి కాదని.. వాళ్లు అలా అవడానికి పురిగొల్పిన పరిస్థితులు, కొందరి ప్రవర్తన గురించి అని ఆయన పేర్కొన్నారు. ‘‘అతని ఆత్మకు శాంతి కలగనివ్వండి. అతని మరణానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసుల దర్యాప్తును కొనసాగనివ్వండి. పని చేయడానికి ఉత్తమమైన ప్రదేశాల్లో నిస్సందేహంగా మా పరిశ్రమ ఒకటి. కానీ ఇప్పుడు చర్చంతా డిప్రెషన్ గురించే కాబట్టి మనం చేసే పనుల కారణంగా వారిని డిప్రెషన్‌లోకి పోనివ్వకుండా చూసుకుంటే బాగుంటుంది’’ అని ట్వీట్ చేశారు.
సినిమా అవకాశాల కోసం వచ్చే వారిని గౌరవంగా చూడాలని.. అమ్మాయిలను సెక్సువల్ హెరాస్‌మెంట్‌కి గురి చేసి భయపడి పారిపోయేలా చేయవద్దని సంజీవ్‌రెడ్డి హితవు పలికారు. సహనటులు, ఇతర సిబ్బంది విషయంలో స్నేహంగా మెలగాలని సూచించారు. ఇండస్ట్రీలో ఎవరైనా నచ్చకపోతే వారి మానాన వారిని వదిలెయ్యాలని.. కానీ అవకాశాలు రాకుండా చేయడం తగదన్నారు. సినీ ప్రయాణంలో రివ్యూ రైటర్స్, వెబ్‌సైట్స్ ఓనర్స్‌ది ప్రత్యేక పాత్ర అన్నారు. కానీ కొన్ని రివ్యూస్, ఆర్టికల్స్ విషయంలో వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని.. ఇవి మానుకోవాలని సంజీవ్‌రెడ్డి సూచించారు. అటెన్షన్ కోసం నటీనటులను ట్రోల్స్ చేయవద్దని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌కి తెలిపారు. ఇవన్నీ ఆచరించడం కొందరికి కష్టమే అయినా మారడం వలన చాలా మందిని డిప్రెషన్ బారిన పడకుండా కాపాడిన వారవుతారని గుర్తుంచుకోవాలన్నారు.