Krishnam Raju : స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు... సిగ్గు! సిగ్గు!.. కృష్ణంరాజుకు ఇదేనా నివాళి: వర్మ

ఎన్నో చిత్రాలతో మరపురాని పాత్రలతో ఐదున్నర దశాబ్ధాల పాటు తెలుగు ప్రజలను అలరించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు కృష్ణంరాజు నివాసానికి చేరుకుని ఆయనకు కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. రెబల్‌స్టార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. లక్షలాది మంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా కృష్ణంరాజుకు నివాళులర్పిస్తున్నారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు, కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ .. కృష్ణంరాజు మరణాన్ని వేదికగా చేసుకుని టాలీవుడ్ పెద్దలపై విరుచుకుపడ్డారు.

చిరు, బాలయ్య, పవన్.. రేపు మీకూ ఇదే దుస్థితి తప్పదేమో:

సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వరుస ట్వీట్లు చేస్తూ అందరికీ ఇచ్చిపడేశారు. భక్తకన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న , తాండ్ర పాపారాయుడు లాంటి గొప్ప చిత్రాలు అందించిన మహానటుడు, గొప్ప నిర్మాతకు టాలీవుడ్ పెద్దలు ఘనంగా వీడ్కోలు పలకలేదంటూ వర్మ ఫైరయ్యారు. రెబల్‌స్టార్‌కు నివాళిగా ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపుకోలేని స్వార్ధపూరిత తెలుగు సినీ పరిశ్రమకు నా జోహార్లు, సిగ్గు సిగ్గు అంటూ ఆర్జీవీ కామెంట్ చేశారు. అంతేకాదు. కృష్ణ, మురళీ మోహన్, చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య, ప్రభాస్, మహేశ్, పవన్ కల్యాణ్‌లకు కూడా ఇదే దుస్థితి తప్పదని.. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వర్మ ఫైరయ్యారు.

రెండు రోజులు షూటింగ్ ఆపలేరా :

మనసు లేకపోయినా ఓకే... కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. రెండు రోజులు షూటింగ్ ఆపుదాం.. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుందని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది అంటూ టాలీవుడ్‌పై సెటైర్లు పేల్చారు వర్మ. మరి దీనిపై సినిమా పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కొందరైతే కృష్ణంరాజుకు ఘనమైన నివాళే దక్కిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆయన కోసం అలనాటి స్టార్స్ నుంచి నేటి యువ హీరోల వరకు కదలివచ్చారు. మరి వర్మ ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశారో, ఏం కావాలనుకుంటున్నారో.