Ram Gopal Varma:వ్యూహం వెనుక వైసీపీ లేదు.. నిజం బట్టలు విప్పుతా, జగన్‌ను సీఎం చేయడానికి నేనెవరినీ : ఆర్జీవీ
- IndiaGlitz, [Sunday,August 13 2023]
వ్యూహం సినిమాపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యూహం సినిమాలో తాను ఎవరిని టార్గెట్ చేయడం లేదని.. సీఎం వైఎస్ జగన్ జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాల ఆధారంగా సినిమా తీస్తున్టులు తెలిపారు. జగన్ అంటే ఏంటో ఇందులో చూపిస్తానని.. తాను నమ్మిన నిజాన్ని చెబుతానని వర్మ వెల్లడించారు. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని.. ఈ సినిమాలో ఎన్నో అంశాలు వుంటాయని, వైఎస్ వివేకా హత్య గురించి కూడా ఇందులో ప్రస్తావించానని ఆర్జీవీ తెలిపారు.
పవన్ తప్పించి ఎవరూ ఏమి అనడం లేదు :
వ్యూహం సినిమాకు వైసీపీ నేతలు ఆర్ధికంగా అండగా నిలిచారన్న వాదనలను వర్మ కొట్టిపారేశారు. 60 నుంచి 70 శాతం సినిమా పూర్తయ్యిందని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు. మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్ తప్పించి ఏ ఒక్కరూ తనను కామెంట్ చేయడం లేదని వర్మ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే ఏపీ ఎన్నికల్లో వ్యూహం ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఆర్జీవీ చెప్పారు.
రెమ్యూనరేషన్ ఇచ్చే వాడిదే తప్పు :
రెమ్యూనరేషన్ తీసుకునేవాడిది ఏ తప్పూ వుండదని.. తప్పంతా ఇచ్చేవాడిదేనని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రెమ్యూనరేషన్ అనేది హీరోల మార్కెట్‌ను బట్టి వుంటుందని ఆయన తెలిపారు. తాను నమ్మినదే చేస్తానని వర్మ స్పష్టం చేశారు. అలాగే వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి తానెవరిని అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. నోరున్న ప్రతి ఒక్కడికి ఒక ఓపీనియన్ వుంటుందని.. చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు.
టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో :
టాలీవుడ్‌ను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని.. టీడీపీ నేతలు మాట్లాడితే మనుషుల బట్టలు విప్పుతామని అంటూ వుంటారని, తాను వ్యూహంలో నిజాన్ని బట్టలు లేకుండా చూపిస్తానని వర్మ పేర్కొన్నారు. వంద శాతం నెగెటివ్‌గా చూపిస్తానేమోనని టీడీపీ వాళ్లు తనను టార్గెట్ చేశారని రామ్ గోపాల్ వర్మ దుయ్యబట్టారు. సినిమాకు కావాల్సిన డేటా తన రీసెర్చ్ నుంచే వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనుకుంటే నిద్రపట్టదంటూ వర్మ వ్యాఖ్యానించారు.