Ram Gopal Varma: ఆ పోస్టులు అభిమానిగా చేసినవే, పవన్ కల్యాణ్ గారు.. మీ భాయిజాన్ జాగ్రత్త : నాగబాబుకు ఆర్జీవీ కౌంటర్
- IndiaGlitz, [Monday,January 16 2023]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వీరిద్దరి సమావేశంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు కలిసే పోటీ చేస్తాయనే సంకేతాలను ఇచ్చినట్లు అయ్యింది. ఆ తర్వాత వైసీపీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిసింది. అంతా బాగానే వుంది కానీ... మధ్యలోకి స్టార్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ రావడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేశాడని.. రెస్ట్ ఇన్ పీస్ కాపులు, కాంగ్రాట్స్ టూ కమ్మోళ్లు అంటూ వర్మ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.
వర్మకు దశ దిన కర్మ చేసిన కాపులు :
ఈ మాటలతో కాపు సామాజిక వర్గం రగిలిపోయింది. నైతిక విలువలు లేని వాళ్లు కూడా మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు.. వర్మకు ఏకంగా దిశ దిన కర్మ ఏర్పాటు చేసి భోజనాలు కూడా పెట్టేశారు. ఈ సంగతి అలా వుంచితే.. తన సోదరులపై ఈగ వాలినా రగిలిపోయే మెగా బ్రదర్ నాగబాబు ఆర్జీవీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వర్మ.. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోయే వ్యక్తని, అతనో పెద్ద వెధవ అంటూ గట్టిగా ఇచ్చిపడేశారు.
సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో ఆర్జీవీ సందడి :
దీనికి రామ్‌గోపాల్ వర్మ సైతం వెంటనే రియాక్ట్ అయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్జీవీ గోదావరి జిల్లాల్లో పర్యటించి పలువురు వైసీపీ కార్యకర్తలను, నేతలను కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల్లో తనకు చాలా మంది స్నేహితులు వున్నారని, సంక్రాంతి సందర్భంగా వారు తనను పిలిస్తే ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఇదే సమయంలో ఓ విలేకరి.. నాగబాబు వ్యాఖ్యలపై ప్రశ్నించారు. దీనికి స్పందించిన వర్మ.. నాగబాబు ఏమన్నారో తనకు తెలియదని, వాటిని విన్న తర్వాత స్పందిస్తానని అక్కడి నుంచి వచ్చేశారు. ఆ కాసేపటికే నాగబాబుకు కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేశారు.
ఆ పోస్టులు అర్ధం కాకపోతే నా దురదృష్టం :
అందులో ఏమన్నారంటే.. హలో పవన్ కల్యాణ్ గారు.. మీ భాయిజాన్ గారిని కాస్త అదుపులో పెట్టుకోండి అంటూ సున్నితంగా హెచ్చరించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్‌కు నాగబాబు ప్రియమైన వ్యక్తి కావొచ్చేమో కానీ తనకు కాదని తేల్చిచెప్పారు. తాను జనసేన పార్టీ మీద కానీ, పవన్ మీద గాని పెట్టిన పోస్టులు ఓ అభిమానిగా చేసినవేనని ఆర్జీవీ అన్నారు. అవి వారికి అర్ధంకాకపోవడం తన దురదృష్టమని, తనకంటే ఎక్కువగా పవన్ కల్యాణ్ దురదృష్టమని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. మరి దీనికి జనసైనికులు, పవన్ కల్యాణ్, నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
Hello @Pawankalyan gaaru , Konchem mee bhaijaaan gaarini choosukondi pic.twitter.com/8ih8kgxlDC
— Ram Gopal Varma (@RGVzoomin) January 15, 2023