Natti Kumar - RGV : వివాదానికి తెర .. దోస్త్ మేరా దోస్త్ అంటోన్న రామ్‌గోపాల్ వర్మ - నట్టి కుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
మొన్నామధ్య సినీ నిర్మాత నట్టి కుమార్, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మధ్య నడిచిన వివాదం అంతా ఇంతా కాదు. తనకు రావాల్సిన బాకీని తీర్చకుండా వర్మ మోసం చేశాడని నట్టి కుమార్ ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి ఆధారాలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత నట్టి క్రాంతి, నట్టి కరుణ తదితరులపై ఆర్జీవీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడంతో విషయం ఎక్కడి దాకా వెళ్తుందోనని చిత్ర వర్గాల్లో ఆసక్తికర చర్చ నడిచింది.
మధ్యవర్తులే చిచ్చు పెట్టారు:
అయితే చివరికి ఇది టీ కప్పులో తుఫాను చందాన ముగిసిపోయింది. తామిద్దరం కలిసి పోయామని, ఇరువురం పెట్టుకున్న కేసులన్నీ కూడా వాపస్ తీసుకుంటున్నామని ప్రకటించేశారు. చేతిలో చేయి వేసుకుని దోస్త్ మేరా దోస్త్ అంటూ ఓ ఫ్రెండ్‌షిప్ సాంగ్ వేసుకున్నారు. ఇకపై తాము ఎప్పుడూ ఇలానే ఉంటామని, మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూసిన మధ్యవర్తుల పని పడతామని నట్టి కుమార్ హెచ్చరించారు.
నట్టి క్రాంతి, కరుణలను అరెస్ట్ చేయొద్దన్న తెలంగాణ హైకోర్టు:
నిర్మాత నట్టి కుమార్, ఆయనకు కుమారుడు క్రాంతి, కుమార్తె కరుణ కొన్ని సినిమాలకు సంబందించి ఆర్ధిక లావాదేవీల విషయంలో ఆర్జీవీతో వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నట్టి క్రాంతి, నట్టి కరుణలు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడంతో పాటు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ రాంగోపాల్ వర్మ కేసు పెట్టారు. అయితే దీనిపై వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో వారిద్దరినీ అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం శుక్రవారం స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది.
ఇకపై కలిసి పనిచేస్తాం:
ఇదిలావుండగానే.. నట్టి కుమార్, రామ్‌గోపాల్ వర్మలు కాంప్రమైజ్ అయినట్టు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇకపై తామిద్దరం మంచి స్నేహితులమని వర్మ వ్యాఖ్యానించగా.. మధ్య వర్తుల వల్లే మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని.. కేవలం డబ్బు వల్లే సమస్య వచ్చిందని నట్టి కుమార్ తెలిపారు. తాము ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలా ఉంటామని, ఇకపై కూడా అలానే కొనసాగుతామని చెబుతూ వివాదానికి తెరదించారు.
No permanent enemies in films and politics pic.twitter.com/2AloxjdHbr
— Ram Gopal Varma (@RGVzoomin) June 11, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments