జగన్‌తో రాజమౌళి, డీవీవీ దానయ్య భేటీ: టాలీవుడ్ అటెన్షన్, ఈ కలయిక ‘ఆర్ఆర్ఆర్’ కోసమేనా..?
- IndiaGlitz, [Monday,March 14 2022]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వారిద్దరూ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 25న ఎన్టీఆర్- రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా... గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ ధరలకు సంబంధించి వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. అనేక చర్చలు, భారీ కసరత్తు, ఎదురుచూపులు తర్వాత టాలీవుడ్‌కు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచుతూ ఇటీవల జీవో జారీ చేసింది. దీని ప్రకారం.. టికెట్ల రేట్లు కనిష్టంగా రూ.20, గరిష్ఠంగా 250 నిర్ణయించింది. ఏరియాను బట్టి థియేటర్లను నాలుగు రకాలుగా విభజించి ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ఈ రేట్లకు జీఎస్టీ అదనం.
హీరో, దర్శకుడి రమ్యూనరేషన్ కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ఏపీ సర్కార్. సినిమా విడుదలైన తర్వాత కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం ఇచ్చింది. అయితే, 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం జీవో పేర్కొంది. కాగా.. చిన్న సినిమాలపై జగన్ సర్కార్ కరుణ చూపింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ఇకపోతే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.