చిరంజీవి నచ్చావోయ్.. ఇందుక్కాదూ మెగాస్టారైంది: ప్రముఖ దర్శకుడు
- IndiaGlitz, [Sunday,March 07 2021]
మెగాస్టార్ చిరంజీవి.. సామాన్యుడిగా వచ్చి ఇండస్ట్రీలో అసామాన్యుడిగా ఎదిగారు. ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకున్నారు. ఏమాత్రం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి.. ఇప్పుడు ఇండస్ట్రీకి తనే బ్యాక్‌బోన్‌లా నిలుస్తున్నారు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికీ చిరంజీవే స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదు. ఆ మధ్య కాలంలో పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన స్టార్ డమ్‌కి లోటేమీ రాలేదు. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు ఆదరించారు. ఇప్పుడు మళ్లీ యంగ్ హీరోలకు ధీటుగా సత్తా చాటుతున్నారు.
అంతేనా సినిమాల జోరును పెంచేసి కాలంతో పాటుగా 65 ఏళ్ల వయసులోనూ పరుగులు పెడుతున్నారు. వరుస సినిమాలకు సైన్ చేసి ఒకదాని వెంట మరొకటి పట్టాలెక్కించేస్తున్నారు. తాజాగా ‘ఆచార్య’కు గుమ్మడికాయ కూడా కొట్టేశారు. మరో సినిమాను లైన్‌లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ స్పీడ్ చూసిన ఓ దర్శకుడు తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారు కదా..! ‘ఆంధ్రాపోరి’, ‘రుషి’, ‘ఐతే 2.0’ చిత్రాల దర్శకుడు రాజ్ మాదిరాజు. ఆయన మెగాస్టార్ గురించి పెట్టిన పోస్ట్ ఇదే..
‘‘చిరంజీవి అని ఇండస్ట్రీకి ఓ కొత్తబ్బాయొచ్చాడంట..
పొద్దున్నే నాలుగున్నరకి లేచి గంటన్నరసేపు జిమ్ములో కసరత్తులు చేస్తున్నాడంట..
నిన్ననే ఆచార్య అనే సినిమాకి గుమ్మడికాయ కొట్టేశాడంట..
మండే మార్చి, ఏప్రిల్, మే ఎండల్లో ఒక సినిమా షూటింగుకి డేట్లిచ్చాడంట..
జూనొదిలేసి జూలై, ఆగస్టు, సెప్టెంబరు రెండోది, అక్టోబరునుంచి క్రిస్మస్‌లోగా మరోటి షూటింగు ఫినిష్ చేయాలని ప్లానింగంట..
పారలల్‌గా రైటర్లతో కథాచర్చల్లో.. కూర్చుంటే పన్నెండు పద్నాలుగు గంటలపాటు నాన్‌స్టాప్ కొట్టేస్తన్నాడంట..
షాటు పూర్తయాక సెట్టులోనే కుర్చీ వేసుక్కూర్చుంటన్నాడంట.. క్యారవానెక్కి కూర్చునే పనే లేదంట.. మిగతా యాక్టర్లందరూ చచ్చుకుంటూ పక్కనే కూర్చుని షాటుకోసం వెయిటింగంట..
బాబూ చిరంజీవీ.. నచ్చావోయ్..
యేడాదికి మూడు సినిమాలు షూటింగు అలవోకగా ఫినిష్ చేసి రిలీజు చేయగలిగిన దమ్మున్నోడివి గాబట్టి కాదూ..
అరవయ్యయిదొచ్చినా ఇరవయ్యయిదేళ్లవాడిలా కష్టపడతావని, ప్రొఫెషనలిజంకి పెద్దపీట వేస్తావనీ కాదూ..
కథానాయకుడిగానే కాదు కష్టకాలంలో ఇండస్ట్రీకి నాయకుడిగా బై ఎగ్జాంపుల్ ముందుండి నడిపిస్తావని కాదూ..
ఇందుక్కాదూ మెగాస్టారయింది నువ్వు..
ఆచార్యా.. టేకెబౌ..’’