డైరెక్టర్ క్రిష్‌కు కరోనా పాజిటివ్.. పవన్‌తో షూటింగ్ క్యాన్సిల్..

  • IndiaGlitz, [Saturday,January 02 2021]

సినీ ప్రముఖులంతా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టిందనగానే ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా కాస్త రిలాక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే క్రిస్టమస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, బర్త్ డే పార్టీస్ అంటూ సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు. దీంతో సామాన్య ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా మహమ్మారికి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడం గమనార్హం. పవన్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో పవన్ కూడా స్పీడ్ పెంచేశారు. ఓ వైపు క్రిష్ దర్శకత్వంలో మూవీతో పాటు మరో సినిమాను ఏకకాలంలో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్, క్రిష్ కాంబోలో పిరియాడిక్ డ్రామా తెరకెక్కనుంది. ఈ సినిమాను పట్టాలపైకి తీసుకెళ్లే క్రమంలోనే క్రిష్ టెస్ట్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయినట్టు సమాచారం. క్రిష్ కోలుకున్న వెంటనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం.