'కంచె' కు కథే స్టార్...కమర్షియల్ సక్సెస్ ష్యూర్ - డైరెక్టర్ క్రిష్
- IndiaGlitz, [Monday,October 19 2015]
గమ్యం, వేదం, క్రిష్ణం వందే జగద్గురుమ్..ఇలా వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి...తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న విభిన్న కధా చిత్రాల దర్శకుడు క్రిష్. మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన తాజా చిత్రం కంచె. రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంతో విభిన్నకధా చిత్రంగా కంచె చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ఈనెల 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కంచె డైరెక్టర్ క్రిష్ తో ఇంటర్ వ్యూ మీకోసం..
గమ్యం, వేదం, క్రిష్ణం వందేజగద్గురుమ్...ఇలా డిఫరెంట్ టైటిల్స్ తో సినిమాలు తీసారు కదా..టైటిల్ అనుకుని కథ రెడీ చేస్తారా..? లేక కథ రాసుకున్నాకా టైటిల్ పెడతారా..?
గమ్యం నుంచి ఇప్పటి వరకు కథ అనుకున్న తర్వాతే టైటిల్ పెట్టడం జరిగింది. ఒక సినిమాకి ముఖచిత్రం లాంటిది టైటిల్. సినిమాలో ఏం చూపిస్తున్నామో కాస్త తెలిసేలా టైటిల్ ఉండాలి. అలాగే సినిమా చూసిన తర్వాత ప్రతిదీ టైటిల్ లోఒదిగిపోయేట్టు ఉండాలి. అందుచేత నేను టైటిల్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటాను. నేను పెట్టిన టైటిల్స్ అన్నీ..కథానుగుణంగా..కథకోసం పెట్టినవే.
కంచె అనేది రెండు గ్రామల మధ్య ఉండే గ్యాప్పా..లేక వ్యక్తుల మధ్య ఉండే గ్యాప్పా..లేక కులాల మధ్య ఉండే గ్యాప్పా..?
రెండు దేశాల మధ్య..అనేక దేశాల మధ్య, కులాల మధ్య, భాషల మధ్య, యాసల మధ్య, మనుషుల మధ్య కనిపించని కంచె ఉంటుంది. అది చూసుకుని దాటాలి. కొన్ని సార్లు చూసుకుని దాటకపోతే కంచె మన కాళ్లకు చుట్టేసుకుంటుంది.చదువుకున్న వాళ్ల దేశమైనా జర్మన్ లు కూడా మూర్ఖత్వపు వాదానికి... పిడివాదానికి జయహో అన్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... దేశాల మధ్య కంచె ఉంటుంది. దూపాటి హరిబాబు, సీతాదేవి వీళ్లిద్దరు మద్రాసులో చదువుకుంటారు. ఆతర్వాత ప్రేమలో పడతారు. వీళ్లు ఊరు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమిటి..?వీరి ప్రేమను విచ్చిన్నం చేయడానికి ఎలా కంచెలు ఏర్పడ్డాయనేది కథ.
కంచె కథకు మూలం ఏమిటి..?
వైజాగ్ లో వేదం షూటింగ్ జరుగుతున్నప్పుడు వైజాగ్ పై జపాన్ బాంబు దాడి చేసిందని విన్నాను. ఆ బాంబు ఇంకా మ్యూజియ్ లో ఉంది. అప్పటి నుంచి పరిశోధన చేస్తే..25 లక్షలుకు పైగా ఇండియన్ సోల్జర్స్ జపాన్ తో పోరాడారని విన్నాను. మిలటరీ మాధవరం అని తాడేపల్లిగూడెం దగ్గర ఉంది. అక్కడ నుంచి 2000 మంది సోల్జర్స్ వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 లో పాల్గొన్నారట. 2,000 మంది సోల్జర్స్ అంటే 2000 కథలు. రెండవ ప్రపంచ యుద్ధంలో 25 లక్షల మంది ఇండియన్ సోల్జర్స్ పోరాడారు. 25 లక్షలు అంటే 25 లక్షల కథలు. అలా 25 లక్షల మందిలో ఒకరి కధ కంచె. వరల్డ్ వార్ 2 అయినా తర్వాత ప్రతి దేశం ఈ వరల్డ్ వార్ గురించి సినిమాలు తీయడం జరిగింది. కానీ మనం ఇంత వరకు ఆ జోనర్ ను టచ్ చేయలేదు. తెలుగులో చాలా కథలు తెరపై రాలేదు. అలాంటి తెరపై రాని కథను తీసుకుని చేసిన సినిమా ఇది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.ఈ సినిమా తర్వాత ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి.
గమ్యం, వేదం, క్రిష్ణంవందే జగద్గురుమ్...ఇలా మీ సినిమాలు చూస్తుంటే...సమాజం పై మీకు కోపం ఉన్నట్టు అనిపిస్తుంది కారణం..?
నాకు సమాజం పై కోపం కాదండి..ప్రేమ. గమ్యం, వేదం..సినిమాల్లో తప్పులు అందరు చేస్తారు కానీ వాళ్ల మారతారని చూపించాను. బళ్ళారి అంటే రాఘవ గారు గుర్తుకు వస్తారు. కానీ ఇప్పుడు మైన్స్ గుర్తుకువస్తున్నాయి ఎందుకు ప్రశ్నించడం లేదనేది చూపించాను. నాకు మనిషి మీద నమ్మకం. మనిషి నైజం మీద నమ్మకం అదే నా సినిమాల్లో చూపిస్తుంటాను. ఇలాంటి కథలు చేయడానికే ఇష్టపడుతుంటాను.
మీ సినిమాల్లో కథలకన్నా, క్యారెక్టర్స్ కన్నా..ఎక్కువుగా డైలాగ్స్ పాపులర్ అవుతున్నాయి...? కారణం ఏమిటి..?
నేను డైలాగ్స్ పొదుపుగా వాడతాను. వాడాల్సిన చోట ఖచ్చితంగా వాడతాను. అలాగే ప్రతి డైలాగ్ కి అర్ధం ఉండాలని ప్రయత్నిస్తాను కాబట్టి డైలాగ్స్ పాపులర్ అవుతున్నాయి. నా సినిమాల్లో డైలాగ్స్ ఎంత పాపులర్ అవుతాయో..క్యారెక్టర్స్ కూడా అంతే పాపులర్ అవుతాయి. గమ్యంలో గాలి శీను క్యారెక్టర్ అంతే పాపులర్..వేదంలో కేబుల్ రాజు అంతే పాపులర్. అయితే నా డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బాగా రాస్తారు కాబట్టి డైలాగ్స్ జనానికి బాగా గుర్తుంటున్నాయి అంతే.
గాలి శీను లాంటి క్యారెక్టర్..మళ్లీ మీ సినిమాల్లో కనపడ లేదు..కారణం..?
కేబుల్ రాజు క్యారెక్టర్ ..బిటెక్ బాబు క్యారెక్టర్ అలా అనుకుని ప్రయత్నించిందే. అయినా కథను బట్టి క్యారెక్టర్ మారిపోతుంటుంది. మీరన్నట్టు ప్రతి సినిమాల్లో గాలి శీను క్యారెక్టర్ పెడితే..క్రిష్ మళ్లీ పాత క్యారెక్టర్స్ నే చూపిస్తున్నాడు రా అని నన్ను ఇంటికి పంపించేసేవాళ్లు.
మీ సినిమాలుకు మంచి సినిమాలుగా పేరు వస్తుంది. కానీ కమర్షియల్ సక్సెస్ సాధించడం లేదు...? మీరేమంటారు..?
కమర్షియల్ సక్సెస్ అంటే..మనం ఎంత డబ్బులు పెడితే అది రావడం లేదా..అంతకు మించి రావడం. శ్రీమంతుడు సినిమాను తీసుకుంటే.. మహేష్ బాబు లేకండా కొత్తవాళ్లతో తీస్తే శ్రీమంతుడు అంత కలెక్షన్స్ సాధిస్తుందా..? కమర్షియల్ సక్సెస్ రావలంటే స్టార్ ఉండాల్సిందే. కంచెకు కథే స్టార్ అనుకుంటున్నాను. ఖచ్చితంగా కంచె ఈ దసరాకి మంచి విజయం సాధించి కమర్షియల్ సక్సెస్ అందిస్తుందని ఆశిస్తున్నాను.
వరుణ్ తేజ్ ను ద్రుష్టిలో పెట్టుకుని కథ రాసారా..? లేక కథ రాసుకున్నాకా వరుణ్ తేజ్ అనుకున్నారా..?
కథ రాసుకున్న తర్వాత నా మైండ్ లోకి వచ్చిన మొదటి వ్యక్తి వరుణ్ తేజ్. అసలు వరుణ్ తేజ్ తో ఇప్పటికే ఓ సినిమా చేయాలి కానీ కుదరలేదు. కంచె కి కుదిరింది. అలాగే హీరోయిన్ ప్రగ్య ని గబ్బర్ కోసం ఆడిషన్ చేసాను. కథ రాస్తున్నప్పుడే వరుణ్, ప్రగ్య వీళ్లద్దరు మాత్రమే పర్ ఫెక్ట్ అనిపించింది.
కంచె సినిమాని ఇంత తక్కువ టైంలో ఎలా చేయగలిగారు..?
ఈ సినిమా ప్రారంభించే ముదే 20 కోట్లులో సినిమా తీయాలి అని ఫిక్స్ అయ్యాం. లోకేషన్స్ అన్ని ముందు చూసుకుని..ప్రతిదీ ఓకె అనుకున్నాకే షూటింగ్ స్టార్ట్ చేసాం. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ చేయడం వలన అనుకున్న విధంగా అనుకున్న టైమ్ కి కంప్లీట్ చేయగలిగాం.
కంచె సినిమా ఎంత వరకు కమర్షియల్ గా విజయం సాధిస్తుందనుకుంటున్నారు..?
ఈ సినిమాలో బాహుబలి కన్నా ఎక్కువ యుద్దాలు ఉన్నాయి. అలాగే దీనిలో స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి. అన్నింటికి మించి ఇందులో అందమైన ప్రేమకథ ఉంది. ప్రేమకథ కన్నా కమర్షియల్ అంశం ఏముంటుంది.? అలాగే ఫస్టాఫ్ లో12 మినిట్స్ వార్ సీన్ ఉంటుంది. 4 స్మాల్ వార్ సీన్స్ ఉంటాయి. సో..ఖచ్చితంగా కంచె కమర్షియల్ గా విజయం సాధిస్తుందని నా గట్టి నమ్మకం.
మ్యూజిక్ డైరెక్టర్ చిరాన్తన్ భట్ ను ఎంచుకోవడానికి కారణం..?
నేను, చిరాన్తన్ గబ్బర్ సినిమాకి పనిచేసాం. ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తూ వెరీ ఎక్సైట్ అయ్యారు. రీ రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చారు. వార్ సినిమాలో సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో ప్రతిదీ చాలా డీటైల్ గా అందించారు. సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి చిరాన్తన్ మ్యూజిక్ బాగుందని అందరు చెబుతారు.
సీతారామశాస్త్రి గారితో ఒకపాట రాయించుకోవడమే కష్టం. అలాంటిది సింగిల్ కార్డ్ ఆయనతో రాయించుకోవడం మీవల్లే ఎలా అవుతుంది..?
నా సినిమాలు ఇన్ స్పైయిర్ చేస్తున్నాయోమో..పాట రాయడమంటే కథ అప్పటి వరకు జరిగింది అర్ధంచేసుకుని జస్టిఫికేషన్ ఇస్తూ..జరగబోయేది గమనానికి తగ్గట్టు రాయాలి. పాట రాయడమంటే ఆషామాషీగా రాయడం కాదు. చాలా మంది ఆషామాషీగా రాస్తారనుకుంటారు..గురువుగారు రాయరని అపవాద. ఆయన రాయలంటే ఇన్ స్పైయిర్ చేయాలి. నా సినిమాలు ఇన్ స్పైయిర్ చేస్తున్నాయి కాబట్టి రాస్తున్నారనుకుంటాను.
గబ్బర్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు..? కారణం..?
గబ్బర్ సక్సెస్ సాధించలేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే గబ్బర్ 90 కోట్లు కలెక్ట్ చేసింది. నన్ను కమర్షియల్ డైరెక్టర్ ని చేసింది.
వరుణ్ తేజ్ ను కొత్తగా ఎలా చూపించబోతున్నారు..?
ప్రతి మనిషి కళ్లలో పవర్ ఉంటుంది. వరుణ్ కళ్లలో ఆ పవర్ ఎక్కువుగా ఉంటుంది. వరుణ్ కి కష్టపడి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సీన్ చెబితే చాలు..ఆ సీన్ చాలా గమ్మత్తుగా చేస్తాడు. వరుణ్ గత చిత్రం కంటే ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాడు.
వరుణ్ లో నెగిటివ్ క్వాలిటీస్ చెప్పమంటే..?
వరుణ్ చాలా మంచోడు..నాగబాబు గారిలా చాలా మంచోడు.చాలా సున్నిత మనస్తత్వం.
సింగీతం శ్రీనివాసరావు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
ఈ సినిమా ఫస్ట్ షాట్ సింగీతం గారిపైనే తీసాను. ఆయన చాలా ప్రయోగాలు చేసారు. ఈ జోనర్ నా కోసమే వదిలేసారా అనిపించింది. అలాగే ఆయన బిగ్ కమర్షియల్ డైరెక్టర్.ఆయనతో వర్క్ చేయడం హ్యపీ.
మీకు ఏ తరహా సినిమాలంటే ఇష్టం.
సినిమా చూస్తున్నంత సేపు బోర్ లేకుండా ముందు తీసుకెళుతుండాలి. నవ్విస్తుండాలి.అలాంటి సినిమాలంటే ఇష్టం.
మీ తదుపరి చిత్రాల గురించి..?
ముందు కంచె రిలీజ్ చేయాలి. ఆతర్వాతే నెక్ట్స్ సినిమా ఏమిటనేది చెబుతాను. ఒకటి, రెండు కథలు అనుకున్నాను. చర్చలు జరుగుతున్నాయి. కంచె రిలీజ్ తర్వాత ఎనౌన్స్ చేస్తాను.