నిజమైన అభిమానులు అలాగే కోరుకుంటారు - డైరెక్టర్ క్రిష్
- IndiaGlitz, [Monday,January 09 2017]
గమ్యం, వేదం, కృష్ణమ్ వందే జగద్గురుమ్, కంచె...ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న డైరెక్టర్ క్రిష్. నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ భారీ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై క్రిష్ తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణి డైరెక్టర్ క్రిష్ తో ఇంటర్ వ్యూ మీకోసం...!
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేయాలని ఎప్పుడు అనిపించింది..?
మా తాతగారి ఊరు గుంటూరు. అందుచేత నాకు గుంటూరుతో అనుబంధం. చిన్నప్పుడు అమరావతి వెళ్లినప్పుడు చుట్టు పక్కల వైకుంఠపురం తదితర ఊరుల పేర్లు వింటుంటే చాలా గమ్మత్తుగా అనిపించేది. శాతవాహనులు పాలించారని చదివాను. అప్పటి నుంచి ఆలోచన ఉంది. అయితే...ఇప్పుడు ఈ సినిమాని బాలయ్యతో చేయడం అంతా దైవకృపగా భావిస్తున్నాను.
ఈ సినిమా కోసం ఎలాంటి రీసెర్చ్ చేసారు..?
రెండు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం రీసెర్చ్ చేస్తున్నాను. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి పెద్దగా సమాచారం లభించలేదు. తమిళనాడులో కొంచెం సమాచారం లభించింది. రాజసుయాగం జరిగింది అని తెలిసింది. అది ఎలా జరిగింది అనేది తెలియదు. అందుచేత మాకు లభించిన ఇన్ ఫర్మేషన్ ని మేము నమ్మినట్టుగా చూపించాం.
ఈ కథకు ముందు నుంచి బాలకృష్ణే హీరో అనుకున్నారా...? లేక వేరే హీరో అనుకున్నారా..?
బాలకృష్ణ గారికి ఈ కథ కరెక్ట్ గా సరిపోతుంది అనిపించింది. ఆయనకి కథ చెబుతాను అన్నప్పుడు గంటలో చెప్పమన్నారు. కథ చెబుతుంటే ఆయనలో గౌతమీపుత్ర శాతకర్ణి చూసాను. గంట అనుకున్నది రెండు గంటలు అయ్యింది. ప్రతి సీన్ కి ఆయన స్పందించిన విధానం చూసి ఈ కథ నచ్చింది అనిపించింది.
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఎలా ఉంటుంది..?
గౌతమీపుత్ర శాతకర్ణి యుద్దపిపాసి. అన్ని రాష్ట్రాలను ఒక దేశంగా చేయలాని తపించాడంటే ఆయన ఎలాంటివాడో అర్ధం చేసుకోవచ్చు. దేశం మొత్తం గుర్రాల మీద ప్రయాణం చేసి అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చాడు. అతని లక్ష్యం ఏమిటి..? లక్ష్యం సాధించే క్రమంలో ఏం జరిగింది అనేది ఈ చిత్రంలో చూపించాం.
బాహుబలితో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని పోల్చుతున్నారు మీరేమంటారు..?
బాహుబలి ఫాంటసీ మూవీ. గౌతమీపుత్ర శాతకర్ణి హిస్టారికల్ మూవీ. మన భారతదేశంలో జరిగిన కథ ఇది. అందుచేత బాహుబలితో పోల్చడం కరెక్ట్ కాదు.
మీకు ఈ సినిమా విషయంలో రాజమౌళి సలహాలు ఇచ్చారని విన్నాం ఏమిటా సలహాలు..?
గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ టైమ్ పడుతుంది అందుచేత వీలైనంతగా నేచురల్ గా తీయమన్నారు. అలాగే సినిమా పూర్తి అయ్యే వరకు నువ్వు పడుకోకు టీమ్ ని పడుకోనివ్వకు అని చెప్పారు.
ఇంత భారీ చిత్రాన్ని ఇంత త్వరగా ఎలా తీసారు..?
ఫస్ట్ నుంచి అంతా పక్కా ప్లాన్ తో వర్క్ చేసాం. అమరావతిలో సినిమా ఎనౌన్స్ మెంట్, హైదరాబాద్ లో సినిమా ప్రారంభోత్సవం, కోటిలింగాలలో ట్రైలర్ రిలీజ్, తిరుపతిలో ఆడియో రిలీజ్, విశాఖపట్నంలో పతాకోత్సవం...ఇలా ప్రతిదీ పక్కా ప్లాన్ ప్రకారం చేసాం. షూటింగ్ ప్రారంభం కాక ముందు నుంచి ప్రణాళిక ప్రకారం వర్క్ చేయడం వలన అనుకున్న విధంగా సినిమాని పూర్తి చేయగలిగాం.
సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఈ సినిమాని చూసి ఏమన్నారు..?
99 సినిమాల్లో నటించిన అనుభవాన్ని అంతా రంగరించి బాలకృష్ణ గారు ఈ సినిమా చేసారు. సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ఈ సినిమా చూసి ఒక్కో సీన్ గురించి ఐదు నిమిషాలు మాట్లాడారు. దీనిని బట్టి అర్ధం చేసుకోండి సినిమా ఎలా ఉంటుందో. ఇలాంటి పాత్రను బాలయ్య మాత్రమే చేయగలరు.
సినిమా పూర్తయ్యింది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది..?
ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇదంతా దైవకృప వలన జరిగింది అనిపిస్తుంది. ఈ కథను నేను ఎప్పుడో అనుకోవడం...అది ఇప్పుడు బాలయ్యకు చెప్పడం విన్నవెంటనే ఆయన ఓకే చెప్పడం...ఇది బాలయ్య 100వ సినిమా కావడం...ఓరోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు వర్షం కావాల్సి వస్తే అనుకోకుండా వర్షం పడడం ఇదంతా దైవకృపగా భావిస్తున్నాను.
ఈ సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రకు హేమమాలినిని ఎలా ఒప్పించారు..?
హేమమాలిని గారికి కథ చెబుతాను అని చెప్పినప్పుడు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఒక గంటలో కథ చెప్పమంటే....ఉగాది ఎలా స్టార్ట్ అయ్యింది అనేది చెప్పాను. ఈ కథ విని చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆతర్వాత నాతో ఈ కథ గురించి ఇలా చేస్తే బాగుంటుంది అంటూ కొన్ని సీన్స్ గురించి డిష్కస్ చేసారు. దీంతో ఈమె ఈ సినిమా చేస్తున్నారు అన్నమాట అనిపించింది. ఏమాత్రం టెన్షన్ లేకుండా తెలుగు అంతగా తెలియకపోయినా డైలాగ్స్ చెప్పారు.
బాలకృష్ణ 100వ సినిమా అని టెన్షన్ పడ్డారా..?
టెన్షన్ పడలేదు. గొప్పగా తీయాలి అని ఆలోచించాను కానీ టెన్షన్ పడలేదు. బాలయ్య 100వ సినిమా చేయడం నాకు దక్కిన గౌరవంగా భావించాను.
సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెం 150, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి రెండు చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో అభిమానుల మధ్య పోటీ నెలకొంది. ఈ ఆసక్తికర పోటీ గురించి మీరేమంటారు...?
ఈ రెండు చిత్రాలను ఆదరిస్తారు అని నా నమ్మకం. సోషల్ మీడియాలో కొంత మంది దారుణంగా పోస్ట్ లు పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఎంత తక్కువుగా ఉంటే అంత మంచిది అని నా అభిప్రాయం. బాలకృష్ణ గారు ఈ సినిమా ప్రారంభోత్సవంకు చిరంజీవి గార్ని ఆహ్వానించారు. ఆ టైమ్ లో చిరంజీవి గారు ఈ సినిమా కథ ఏమిటి అని అడిగితే...30 నిమిషాల్లో కథ చెప్పాను. బాలయ్య మంచి సినిమాతో కథ చేస్తున్నారు అని చెప్పారు. బాలయ్య చిరంజీవి గారి సినిమా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. చిరంజీవి గారు బాలయ్య సినిమా సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించారు. నిజమైన అభిమానులు ఎవరైనా తమ హీరో చెప్పింది నిజం కావాలి అని కోరుకుంటారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలతో పాటు శతమానం భవతి, ఆర్ నారాయణమూర్తి సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి...?
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో తెలియచేస్తాను.