సాలిడ్ కంటెంట్, అన్నిఎమోషన్స్ ఉన్న 'దొంగ' తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది - దర్శకుడు జీతు జోసెఫ్
Send us your feedback to audioarticles@vaarta.com
'దృశ్యం' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాప్యులారిటీ సంపాదించుకున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'దొంగ'. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్ అందిస్తున్నారు. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జీతు జోసెఫ్ ఇంటర్వ్యూ..
తెలుగు లో ఫస్ట్ టైమ్ మీ సినిమా రిలీజ్ కాబోతుంది కదా! ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషంగా ఉంది. 2014లో 'దృశ్యం' సినిమా తెలుగులో రీమేక్ అయ్యి పెద్ద విజయం సాధించినప్పటినుండి తెలుగులో సినిమా చేయాలి అనుకున్నా. మంచి స్క్రిప్ట్ కోసం ఇన్నిరోజులు ఎదురుచూశాను. అయితే ఇప్పుడు 'దొంగ' లాంటి సాలిడ్ కంటెంట్, అన్నిఎమోషన్స్ ఉన్నసినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్ అవడం నిజంగా హ్యాపీ. 'దొంగ' నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా. మంచి కాస్ట్ అండ్ క్రూ కుదిరింది.
'దృశ్యం' సినిమాతో మీరు బాగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా మీకు ఎలాంటి పేరు తీసుకువస్తుంది అనుకుంటున్నారు?
నాకు రెగ్యులర్ కథలు అస్సలు నచ్చవు. నేనెప్పుడూ కొత్త తరహా కథలనే ఎంచుకుంటాను. ఈ సినిమా విషయానికి వస్తే ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటూనే కొంత సస్పెన్స్ ఉంటుంది. 'దృశ్యం' తరువాత ప్రతి ఒక్కరూ నా నుండి సస్పెన్స్ కథలనే కోరుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో కొంత సస్పెన్స్ పెట్టడం జరిగింది తప్ప ఆ సస్పెన్స్ అనేది కథను డామినేట్ చేయదు.
మీరు ఎలాంటి జోనర్స్ చేయడానికి ఇష్టపడతారు?
నా మొదటి సినిమా 'డిటెక్టివ్' ఒక ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్. రెండవ సినిమా 'మమ్మి అండ్ మీ' ఫ్యామిలీ డ్రామా. మూడవ సినిమా 'మై బాస్' ఒక రొమాంటిక్ కామెడీ. ఇలా ప్రతి సినిమా కొత్త జోనర్ లో, కొత్త కథతో ఉండాలని కోరుకుంటా. అయితే తెలుగులో, తమిళ్ లో మాస్ సినిమా చూసినప్పుడు తప్పకుండా నేను కూడా ఎలాంటి లాజిక్స్ లేకుండా ఫుల్ కమర్షియల్ మాస్ మసాలా మూవీ చేయాలి అనుకుంటా...
దృశ్యం తరువాత తెలుగులో ఆఫర్స్ ఏమైనా వచ్చాయా?
ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కథలు తీసుకొని వచ్చారు. అయితే ఆ కథలు విన్నాక వాటిపై చాలా వర్క్ చేయాలి అనిపించింది. అదే సమయంలో నేను వేరే సినిమాలతో బిజీ గా ఉండడం వల్ల కుదరలేదు.
దృశ్యం చైనీస్ వెర్షన్ కూడా ఇదే రోజు విడుదలవుతుంది కదా?
అవును. చైనీస్ ప్రొడ్యూసర్స్ హిందీ వెర్షన్ చూసి అక్కడి నిర్మాతలని కాంటాక్ట్ అయ్యారు. వారి ద్వారా నన్ను కలిసి రైట్స్ తీసుకున్నారు. అయితే ఇదంతా జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యే ట్రైలర్ నాకు పంపారు. బాగుంది. అయితే తమిళంలో 'దృశ్యం' నా ఫస్ట్ రిలీజ్. దాని తర్వాత రిలీజవుతున్న రెండో సినిమా 'దొంగ'.
దృశ్యం సినిమా విడుదలైన అన్ని భాషలలో విజయం సాధించింది కదా ! మీరు పాన్ ఇండియా సినిమా చేసే ఆలోచన ఉందా?
తప్పకుండా ఉంది. ఆ సినిమా విడుదలైనప్పుడు అంత పెద్ద సక్సెస్ అవుతుంది అనుకోలేదు. అయితే పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించే కథ ఒకటి నా దగ్గర ఉంది. కాకపొతే దానిమీద కొంత వర్క్ చేయాలి. తప్పకుండా త్వరలోనే రెడీ చేస్తాను. దృశ్యం సినిమా అన్ని భాషలలో సినిమా చేయడానికి బారియర్స్ ఓపెన్ చేసింది అనుకుంటున్నా..
దొంగ గురించి చెప్పండి?
ఈ సినిమాలో కనిపించే చిన్న పిల్లాడి నుండి ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్పస్ ఉండి కథలోఒకభాగం అయి ఉంటుంది. కార్తీ నటన గురించి మనందరికీ తెలిసిందే.. ఈమద్యే 'ఖైదీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో కార్తీ గారికి, జ్యోతిక గారికి మధ్య కీలకమైన రెండు మూడు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ సన్నివేశాలలో ఇద్దరు పోటీపడి నటించారు. అలాగే నికిలా విమల్, సత్యరాజ్ గారి పాత్రలు అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.‘షావుకారు’ జానకి బామ్మ పాత్ర చేశారు.
ఈ సినిమా తెలుగు ప్రొడ్యూసర్ రావూరి వి. శ్రీనివాస్ గురించి?
రావూరి వి.శ్రీనివాస్ గారు సినిమా మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చారు. ఈ చిత్రాన్నిడిసెంబర్ 20న తెలుగులో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com