Harish Shankar:చోటా కె నాయుడికి దర్శకుడు హరీష్‌ శంకర్ వార్నింగ్

  • IndiaGlitz, [Saturday,April 20 2024]

దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar), కెమెరామెన్ చోటా కె నాయుడు మధ్య కొన్నాళ్లుగా ఉన్న విభేదాలు తాజాగా రచ్చకెక్కాయి. తనను కెలకొద్దు అంటూ చోటాకు వార్నింగ్ ఇస్తూ ఏకంగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

(వయసులో పెద్ద కాబట్టి) గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ.... రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటే, నేను ఓ 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరరీతిలో మాట్లాడారు.

మీకు గుర్తుందో లేదో... ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామన్ తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం వల్లో, 'గబ్బర్ సింగ్' వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామన్ ను తీసేస్తున్నాడు అని పది మంది అనుకుంటారన్న కారణం వల్లో... మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా.

ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజూ ఆ నింద మీ మీద మోపలేదు. 'గబ్బర్ సింగ్' వచ్చినప్పుడు అది నాది, 'రామయ్య వస్తావయ్యా' విషయంలో అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకపోయినా, నాకు సంబంధం లేకపోయినా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు.

ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డాను. కానీ నా స్నేహితులు, నన్ను అభిమానించేవాళ్లు నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తోంది. మీతో పనిచేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు, కూడదు... మళ్లీ కెలుక్కుంటాను అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, నేను సిద్ధం! అంటూ లేఖలో పేర్కొన్నారు.

అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చోట కె నాయుడు మాట్లాడుతూ రామయ్య వస్తావయ్యాకి వర్క్ చేసేటపుడు హరీష్ శంకర్ కొన్ని విషయాల్లో అస్తమానం అడ్డుపడుతుండేవాడు. ఎన్నిసార్లు నేను చెప్పడానికి ట్రై చేసినా వినే మూడ్‌లో లేడు. అందుకే చివరికి తనకు ఏది కావాలో అదే విధంగా నేను పని చేశాను, ఎక్కువసార్లు అటువంటి వారితో వాదించను. నాకు కోపం కూడా ఎక్కువసేపు రాదు. అందుకే తనకు నచ్చిన విధంగానే పనిచేయాల్సి వచ్చింది. దర్శకులకు ఏవో ఆలోచనలు ఉంటాయి కదా అన్నారు