'ఎన్.జి.కె' టైటిల్ గురించి దర్శకుడు ఏమన్నారంటే..
- IndiaGlitz, [Wednesday,March 07 2018]
తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా (సూర్య 36) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు కాగా.. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం సూర్య, సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. ఇదిలా వుంటే.. సెల్వరాఘవన్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ విడుదల చేశారు. టైటిల్ ఎన్.జి.కె' అని పెట్టడంతో.. దాని అర్థం ఏమై ఉంటుందోనని సూర్య అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
దీనికి సెల్వరాఘవన్ స్పందిస్తూ.. ఈ చిత్రంలో సూర్య పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని.. ఈ టైటిల్ లోనే సూర్య పేరు దాగి ఉందని.. అదేంటో చెపితే థ్రిల్ ఉండదని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా, సూర్య ఓ ఛాలెంజింగ్ పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఇంతకన్నా ఏం చెప్పినా సినిమా గురించి మొత్తం చెప్పినట్టే అవుతుందని ముక్తాయించారు. ఇదిలా వుంటే.. ఎన్.జి.కె' అంటే (నాట్ గుడ్, కైండ్) అనే కొత్త అర్ధం చెబుతున్నారు సూర్య అభిమానులు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ప్రకాష్ బాబు, ఎస్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.